ఈ స్రుష్టిలో స్నేహానికి ఉన్న గొప్పదనం మరో దానికి లేదు. అన్ని బంధాల కంటే గొప్పది స్నేహం మాత్రమే. మిగిలిన బంధాలు మనం కోరుకోకుండా వచ్చేవి. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువులు ఇలా ఒక మనిషి పుట్టడంతోనే ఆ బంధాలు రెడీగా  ఉంటాయి. కానీ స్నేహం మాత్రం అలా కాదు. అది మనకు మనముగా సంపాదించాల్సింది. అంటే మనం ఏంటన్న దానిని బట్టే స్నెహం కూడా తెలుస్తుంది. అందుకే స్నేహం అన్నది ఓ అందమైన బంధం, అద్భుతమైన బంధం.


విప్పి చెప్పుకునేది :


ప్రతి మనిషికీ బాధలూ, అనందాలు ఉంటాయి. వాటిని అందరితోనూ పంచుకోలేము. ముఖ్యంగా సంతోషం పంచుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు. అదే కష్టాలను పంచుకోవడానికి మాత్రం రారంటే రారు. అటువంటి సమయంలోనే మంచి మిత్రుని అవసరం కలుగుతుంది. బాధలకు ఓదార్పుగా నిలిచి కన్నీరు తుడిచేవాడే నిజమైన స్నేహితుడు. అటువంటి స్నేహమే కలకాలం నిలిచేది. అన్నిటినీ గెలిచేది.


ప్రాణం పెట్టే వారున్నారు :


స్నేహం కోసం ప్రాణం పెట్టేవారున్నారు. అలాంటి  వారిని చూస్తే ఎంత గొప్పది నేస్తం అనిపిస్తుంది. ఏ బంధానికీ అందనిది, ఏ ఒక్కరికీ చెందనిదే సిసలైన స్నేహం అని చెప్పుకోవాలి. తర తమ  భేదాలు స్నేహంలో ఉండవు. అలా  కనుక ఉంటే అది స్నేహం కానే కాదు. మనకు పురాణాలలో మంచి మిత్రులుగా శ్రీక్రిష్ణుడు, కుచేలుడు కనిపిస్తారు. పేద అయినా కూడా కుచేలునితో  చెలిమి చేయడమే కాదు అడక్కుండా కష్టాలు తీరుస్తాడు క్రిష్ణుడు.



అది నిజంగా గొప్ప స్నేహానికి ప్రతీకగా చెప్పుకోవాలి. నీ దగ్గర ఎంత సంపద ఉందన్నది కాదు ప్రధానం, నీ బాధ వినే ఒక్క స్నేహితుడైనా పక్కన ఉంటే నీ కంటే గొప్ప వాడు లేడంటారు. అదీ స్నేహం గొప్పదనం.


మరింత సమాచారం తెలుసుకోండి: