నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో టీడీపీ అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాలు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి. ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ఇంచా ర్జు ప‌దవి విష‌యంలో త‌లెత్తిన వివాదం చినుకు చినుకు గాలివాన‌గా మారి.. ఇప్పుడు నియోజ‌వ‌క‌ర్గంలో ఓట‌ర్ల‌నే ప్ర‌భావి తం చేసే రేంజ్‌కు చేరుకుంది. ఇక‌, నెల్లూరు జిల్లా నుంచి మంత్రి వ‌ర్గంలో ప్రాతినిధ్యం ఇద్ద‌రు మంత్రులు పి. నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిలు.. ఈ వ‌ర్గ పోరును ఆప‌డం పోయి.. తామే ఎగ‌దోస్తుండ‌డం మ‌రింత వివాదానికి కార‌ణ‌మైం ది. దీంతో ఇక్క‌డి కేడ‌ర్ మొత్తం రెండు వ‌ర్గాలుగా విడిపోయింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో పార్టీ అంటే చుల‌క‌న భావం పెరిగి పోతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. టీడీపీలో సీనియర్ అయిన సోమిరెడ్డి.. జిల్లా మొత్తం మీద తానే ప‌ట్టు సాదించాల‌ని, చంద్ర‌బాబు వ‌ద్ద మార్కులు కొట్టేయాల‌ని చూస్తున్నారు. 


అది కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలో జిల్లా మొత్తంమీద గ్రిప్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక‌, 2014లోటీడీపీ తీర్థం పుచ్చుకుని, ఆవెంట‌నే ఎమ్మెల్సీ అయి మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన పీ నారాయ‌ణ కూడా జిల్లాపై ప‌ట్టుకోసం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు తెర‌చాటుగా వర్గాల‌ను పెంచి పోషిస్తున్నారు. వీరిలో సోమిరెడ్డి వ‌ర్గంగా క‌న్న‌బాబు ఉండ‌గా.. నారాయ‌ణ మాత్రం సోమిరెడ్డి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి ఆదాల ప్ర‌భాక‌ర‌రెడ్డికి వెన్నుద‌న్నుగాఉన్నారు. దీంతో ఇక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌ను నియ‌మించాల్సి వ‌చ్చింది. నియామకంపై మంత్రులు సోమిరెడ్డి, పి.నారాయణ, అమర్నానాథ్‌ రెడ్డి, పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి చర్చించారు. 


అయితే మంత్రులు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలు ఆత్మకూరులో కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్న మంత్రి సోమిరెడ్డి వర్గీయుడు కన్నబాబు తన అనుచరులతో సమావేశానికి వచ్చి ఒక్కరినే ఇన్‌చార్జిగా నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆత్మకూరు వ్యవహారాన్ని సీఎం నిర్ణయానికి వదిలేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీంతో పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా ఉన్న ఆదాలను తాత్కలిక ఇన్‌చార్జిగా నియమించాలని పార్టీ ఆదేశించింది. అయితే, ఆదాల ఇంచార్జ్‌గా రావ‌డం వెనుక మంత్రి నారాయ‌ణ చ‌క్రం తిప్పార‌ని సోమిరెడ్డి భావిస్తున్నారు. దీంతో ఆయ‌న త‌న అనుచ‌రుడు క‌న్న‌బాబును రంగంలోకి దింపి ఆదాల‌కు వ్య‌తిరేకంగా పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. 


నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఆదాల‌ను త‌క్ష‌ణ‌మే త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తూ.. కన్నబాబు పార్టీ కార్యాలయంలో ఆమరణ దీక్షకు అనుచరులతో కలిసి కూర్చోవటంతో హైడ్రామా తారాస్థాయికి చేరింది. ఇంత జ‌రుగుతున్నా.. త‌న‌కు ఏమీ తెలియ‌ద‌న్న‌ట్టుగా మంత్రి నారాయ‌ణ‌.. ఆదాల‌ను వెంటేసుకుని నియోజ‌క‌వ‌ర్గంలో స‌మావేశం నిర్వ‌హించారు. దీంతో ఈ ఆధిప‌త్య పోరు ప‌రాకాష్ట‌కు చేరుకుంది.  ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆదాల‌ను త‌ప్పించే వ‌ర‌కు పోరు ఆగ‌దు దీక్ష‌ను విర‌మించ‌న‌ని ప‌ట్టుబ‌ట్టిన క‌న్న‌బాబు శాంతించినా రేపో మాపో ఈ వివాదం మ‌ళ్లీ ముసురుకునేలా ఉంది. ఈ ప్ర‌త్య‌క్ష వివాదం వెన‌క ఉన్న మంత్రుల్లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: