కాపు బ‌లం ఎక్కువ‌గా ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ రాజకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇక్క‌డ వైసీపీ, టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నా యి. ఇరు పార్టీల‌కూ మంచి అభ్య‌ర్థులు కూడా దొరికారు. అయితే, మ‌రో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీ, ప్ర‌శ్నిస్తానంటూ పొలిటిక‌ల్ అరంగేట్రం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన‌కు మాత్రం ఇక్క‌డ అభ్య‌ర్థి క‌నిపించ‌డం లేదు. పైకి త‌న‌కు కు ల ప్రాధాన్యం లేద‌ని చెబుతున్నా.. ప‌వ‌న్‌కు ఇక్క‌డ మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ కాపు వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డ‌మే. కాపు వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ ఇక్క‌డ ఒకింత బ‌ల‌మైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపితే.. అటు టీడీపీ, ఇటు వైసీపీల‌కు చుక్క‌లు చూపించ‌డం ఖాయం. కానీ, ఎందుకో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఆ దిశ‌గా అడుగులు వేయ‌లేదు., ఇక్క‌డ ఒక్క‌చోటే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న అభ్య‌ర్థ‌ల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


ఇక‌, కాకినాడ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఏడాది ఇక్క‌డ మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్ప‌ట్లోనే ప‌వ‌న్ త‌న అభ్యర్థుల‌ను రంగంలోకి దింపుతార‌ని ఊహాగానాలు వినిపించాయి. అయితే, చివ‌రి నిముషంలో ఆయ‌న యూట‌ర్న్ తీసుకుని ఇంకా పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకోలేద‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి విజృంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రో ప‌దిమాసాల్లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఊపందుకుంది. ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలు త‌మ త‌మ రేంజ్‌ల‌లో ప్ర‌చారం ప్రారంభించేశాయి. ఇదే స‌మయంలో అటు అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నాయి. ముఖ్యంగా గెలుపు గుర్రాల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నాయి. కానీ, ప‌వ‌న్ విష‌యానికి వ‌చ్చే స‌రికి చ‌డీ చ‌ప్పుడు మాత్రం క‌నిపించ‌డం లేదు.

కాకినాడ‌లో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గం ఉండ‌డం, యువ‌త ఎక్కువ‌గా ప‌వ‌న్‌కు అనుకూలంగా మాట్లాడ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తున్న అంశం. 
అయినా.. కూడా ఇక్క‌డ ప‌రిస్థితిపై ప‌వ‌న్ ఇంకా ఏమీ తేల్చుకోలేదు. జ‌నసేన పార్టీ నుంచి పోటీ ఎవరు చేస్తారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్ల తర్వాత స్థానంలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉండడంతో ఇక్కడ ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు, యువత ఉన్నారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపుపై అడపాదడపా ఆందోళనలు, నిరసనలు చేయడం, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం వంటి పనులకే ఆ పార్టీ నేతలు పరిమితమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జనసేన స్థాపించిన తర్వాత నేటి వరకు ఏ ఒక్క పెద్ద నాయకుడు ప్రధాన పార్టీల నుంచి రాకపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 


ప్రజారాజ్యం స్థాపించి ఆ పార్టీ తరపున పోటీ చేసినప్పుడు అప్పట్లో పెద్ద నాయకులు లేకపోయినా ఆ పార్టీ వ్యక్తి ఎమ్మెల్యేగా నెగ్గడంతో జనసేన పార్టీ నేతలు తమ పార్టీ అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తారనే భావిస్తున్నారు. కానీ, ఈ విష‌యంలో ప‌వ‌న్ ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డంతో వారు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: