మనుషులు భగవంతుడిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తుంటారు.  అయితే ఆయన కొంత మందికి నేరుగా కనిపించరని..వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటారని పూర్తి విశ్వాసం చూపిస్తుంటారు.  ముఖ్యంగా ప్రపంచంలో చాలా చోట్ల నాగుపాముని దైవాంశంగా భావిస్తుంటారు.  నాగదేవత పై  ఎన్నో చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పటికీ నాగుల పంచమి రోజు ప్రతి దేవాలయం కిట కిటలాడుతుంది.  తాజాగా తూర్పు గోదావరి జిల్లా దుర్గాడ శివార్లలో సుమారు నాలుగు వారాలుగా ఎటూ కదలకుండా ఉండి, ప్రజల పూజలు అందుకున్న నాగుపాము మృతి చెందింది.

అయితే ఓ రైతుకు తన పొలంలో కనిపించిన ఈ పాము పలుమార్లు అక్కడే దర్శనం ఇవ్వడంతో అది దైవ రూపం అని..సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి తమ ఊరికి వచ్చారని భావించిన ఆ రైతు గ్రామ ప్రజలకు తెలపడంతో ఆ పాముకు పూజలు చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు నాగుపాముకు గుడికూడా కట్టడానికి సన్నద్ధమయ్యారు.  ఇక నాగ ప్రతిష్టకు ప్రతిమలు కూడా తెప్పించారు. 

మరోవైపు వెటర్నరీ అధికారులు మాత్రం నాగుపాము కుబుసం విడిచే సమయంలో అలాగే మగతగా ఉంటుందని..కుబుసం విడిచిన తర్వాత యాక్టీవ్ గా మారిపోతుందని అన్నారు.  ఏది ఏమైనా ఆ పామును మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్న సమయంలో మృతి చెందింది. నాగుపాము మృతి చెందిందన్న సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు అక్కడికి తరలివెళ్లారు. కాగా, సుమారు నాలుగు వారాలుగా పూజలందుకున్న ఈ పాముకు గుడి కట్టించేందుకు భక్తులు నిర్ణయించారు. శ్రావణ మాసంలోగా గుడి కట్టిస్తామని చెబుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: