ఓ సినిమా నటుడు పెట్టిన పార్టీకి సినిమాలు చూపించడం కొత్తా కాదు, వింతా కాదు. సినిమాలు చూపించడానికి వేరే నటులున్నా వారి అవసరం లేదన్నట్లుగా టీడీపీ భావి నాయకుడు లోకేష్ బాబు ఈ మధ్య సినిమా కధలు బాగానే   చెబుతున్నారు. తమ కంటే గొప్ప నటులు లేరనీ చాటి చెబుతున్నారు. బీజేపీకి సినిమా చూపిస్తామంటూ ఈ మధ్య ఆయన తరచుగా అంటున్నారు. ట్రైలర్లు, టీజర్లు  అంటూ మొత్తం సినిమా పరి భాషనే వాడుతున్నారు. అవును మరి ఎంతైనా మామ, తాతా, బావ అంతా సినిమా నటులే కదా


చాలానే  చూపించారుగా :


అన్నింటా అనుభవం ఉందని నాలుగేళ్ళ క్రితం ఏపీ జనం సీనియర్ మోస్ట్ నాయకుడు చంద్రబాబును సీఎం గా ఎన్నుకుంటే ఆయన ఇంతవరకూ జనాలకు చూపించింది పెద్ద సినిమాయే కదా అంటూ ఓ వైపు సెటైర్లు పడుతున్నాయి. ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ ఎన్ని రకాల  సినిమాలు చూపించారో ఏపీ ప్రజలకే బాగా ఎరుక. బాహుబలి డిజైన్లు, సింగపూర్ సొగసులు, జపాన్ అందాలు, చైనా రాజధాని బీజింగ్ జిగి బిగిలు ఇలా ప్రపంచ అందాలన్నీ చూపించిన గొప్ప సినిమా అమరావతి కాదా చినబాబూ అంటున్నారు నెటిజన్లు.


అదో పెద్ద కన్నీటి  సినిమా కధ :


ఇక తెలుగువారి చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్ట్  అతి పెద్ద కన్నీటి కధగా మార్చిన ఘనత టీడీపీది కాదా అంటున్నారు. జాతీయ ప్రాజెక్ట్ ను తన చేతిలోకి తీసుకుని అంచనాలు పెంచేసి అటు కేంద్రానికీ, ఇటు ఏపీ జనాలకూ భారీ బడ్జెట్ సినిమా చాన్నాళ్ళుగా చూపిస్తున్నారు  కదయ్యా లోకేష్ బాబూ అంటున్నారు తెలుగు జనం.


బొమ్మ చూపించారుగా :


రైతులకు రుణ మాఫీ అంటూ చెప్పినా, ద్వాక్రా మహిళలకు మొత్తం మాఫీ అన్నా, నిరుద్యోగ భ్రుతి  పేరిట నాలుగేళ్ళుగా యువతను తిప్పుకున్నా, ఆరువందల హామీలతో టోటల్  గా అందరికీ పెద్ద బొమ్మే చూపిచేస్తున్నారుగా అంటు సోషల్ మీడియా  ఓ వైపు కౌంటర్లు వెస్తోందిగా.  ఇది చాలదన్నట్లుగా ఓటుకు నోటు  నోట్ కేసు  పేరు తో  ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా ఆ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలకూ చూపించారుగా  అంటున్నారు. ఇక ప్రత్యేక హోదా సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టేసిందిగా అంటున్నారు.


చూపించేది  వారేగా:


రాజకీయాలలో ఎవరికైన అసలైన సినిమా చూపించేది ఓటర్లు, వారు కరెక్ట్ టైంలో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే బొమ్మ చూపిస్తారు, ఆ దెబ్బకు  ఏ పార్టీ అయినా ఖంగు తినాల్సిందే అంటున్నారు నెటిజన్లు. మరి ఎంత సినిమా  వారసత్వం ఉన్నా ప్రజాస్వామ్యంలో అదే పనిగా బొమ్మలు చూపించేయకూడదుగా, ఎవరికి ఎపుడు ఎలాంటి సినిమా చూపించాలో  జనాలే డిసైడ్ చేసుకుంటారు, మధ్యలో నీకు ఆయాసం ఎందుకు చినబాబు అంటోంది నెట్ లోకం. ఓకేనా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: