ఉత్తరాంధ్ర జిల్లాలు ఇపుడు ఏపీ రాజకీయాలలొ  హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ రాజకీయాన్ని అనుకూలం చేసుకోవడం ద్వారా  రేపటి అధికార పీఠానికి నిచ్చెన మెట్లుగా వాడుకోవాలని అన్ని పార్టీలూ ఆరాటపడుతున్నాయి. నిన్నటి వరకూ జనసేనాని ఇదే వ్యూహంతో ఉత్తరాంధ్ర చుట్టి వచ్చారు. ఇక నువ్వా నేనా అంటూ ఎన్నికల సమర రంగంలో ఢీ కొట్టాలని చూస్తున్న టీడీపీ, వైసీపీలు ఇపుడు సై అంటున్నాయి.


ఆరోజున ఇక్కడే :


దేశానికి స్వేచ్చా వాయువులు అందించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ  ఏపీకి  చెందిన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ ఉత్తరాంధ్రలోనే ఉండడం విశేష పరిణామం. ఈసారి ఇండిపెండెన్స్ డేని శ్రీకాకుళంలో నిర్వహించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ముందు రోజు విజయనగరం టూర్ పెట్టుకున్న సీఎం చంద్రబాబు ఆగస్ట్ 15న శ్రీకాకుళం నుంచి జెండా ఎగరేస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ మీటింగ్ నుంచే వరాల జల్లులు కురిపించడం ద్వారా మూడు జిల్లాలను తిప్పుకోవాలని చంద్రబాబు  ప్లాన్ వేస్తున్నారు.


విశాఖలో జగన్ :


ఈ నెల 12న రాత్రికి విశాఖ జిల్లా నర్శీపట్నంలో జగన్ పాదయాత్ర అడుగు పెడుతుంది. ఆయన ఆగస్ట్ 15న నర్శీపట్నంలో ఉంటారు. అక్కడే పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగరవేస్తారు. ఈ వేడుక ద్వారా జగన్ చెప్పాలనుకున్నది చెప్పి ఉత్తరాంధ్ర కడగండ్లపై సమర శంఖం పూరిస్తారు. తద్వారా అటు పార్టీలోనూ కొత్త జోష్ తీసుకువస్తారు.


అరుదైన సీన్ :



నిజంగా ఇది అరుదైన  సన్నివేశమనే చెప్పాలి. ఓ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ ఏపీకి రెండు కళ్ళు. అటువంటి ఇద్దరూ వెనకబడిన ఉత్తరాంధ్రలో ఒకే మారు ఉండడం, జాతీయ జెండా పండుగలో పాలు పంచుకొవడం రేర్ సీన్ అంటున్నారు. ఇది ముందు జరగలేదు. ఇక ముందు జరుగుతుందో లేదో తెలియదు కానీ రాజకీయంగా ఈ సన్నివేశం అతి కీలకమైనదిగా చరిత్ర పుటలలో నిలిచిపోతుందన్నది నిజం. ఈ ఇద్దరు నాయకులు ఉత్తరాంధ్ర నడి బొడ్డున నిలబడి చేసే ప్రసంగాలు, ఇచ్చే వరాలపై అపుడే జనాలలో ఆసక్తి బాగా పెరిగింది. ఆ రోజు కోసం ఉత్తరాంధ్ర ఎదురుచూస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: