అవును! ఆయ‌న మాజీ మంత్రి. కాంగ్రెస్‌లో ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా చ‌క్రం తిప్పిన నాయ‌కుడు. అయితే, ఇప్పుడు మాత్రం త‌న‌కే టికెట్ ల‌భించ‌ని ప‌రిస్థితి!! ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది ముమ్మాటికీ నిజం. ఆయ‌నే నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి. ఆనం సోద‌రులుగా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ప్ర‌త్యేకత‌ను సృష్టించుకున్న ఈ సోదరుల్లో ఆనం వివేకానంద‌రెడ్డి ప్ర‌స్తుతం లేరు. అయితే,ఆనం రామ‌నారాయ‌ణ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోయింది. కాంగ్రెస్‌లో ఉండ‌గా ఆయ‌న రాష్ట్రంలో మంత్రి ప‌ద‌వులు అనుభ‌వించారు. సౌమ్యుడిగా, వివాద ర‌హితునిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే, 2014లో కాంగ్రెస్ రాష్ట్రంలో అడ్ర‌స్ గ‌ల్లంతు కావ‌డంతో ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయింది. 


నిజానికి అప్ప‌ట్లోనే వైసీపీ నుంచి ఆహ్వానం అందినా..ఆయ‌న త‌న‌క‌న్నా జూనియ‌ర్ అయిన వైఎస్ జగ‌న్ వ‌ద్ద ఉండేదేం టని టీడీపీలోకి జంప్ చేశారు. త‌న‌కు ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌విని సైతం ఆకాంక్షించారు. దీనికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఓకే కూడా చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు కాబ‌ట్టి ఆనంను అడ్డుకునేందుకు నెల్లూరుకే చెందిన ఇద్ద‌రు మంత్రులు చ‌క్రం తిప్ప‌డంలో టీడీపీలో ఆయ‌న‌కు ఆశించిన గుర్తింపు లేకుండా పోయింది. ఇస్తానన్న ప‌ద‌వులు కూడా ల‌భించ‌లేదు. దీంతో విధిలేని ప‌రిస్తితిలో ఆయ‌న వైసీపీవైపు మొగ్గారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఆత్మ‌కూరు లేదా వెంక‌ట‌గిరి టికెట్ ను ఇవ్వాల‌ని త‌న అన్న‌కుమారుడు కి మ‌రో టికెట్ ఇవ్వాల‌ని జగ‌న్‌ను కోరారు. 


అయితే, వీటికి హామీ ల‌భించిందో లేదో తెలియ‌దు కానీ, పార్టీలోకి చేరిక‌పై మాత్రం ఒప్పందం కుదిరిపోయింది. అయితే, ప్ర‌స్తుతం ఆషాడం జ‌రుగుతుండ‌డంతో సెంటిమెంట్‌గా ఫీలైన ఆనం.. వ‌చ్చేశ్రావ‌ణ మాసంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవా ల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇంత‌లోనే మ‌ళ్లీ రాజ‌కీయాలు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారుతున్నాయ‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో త‌న‌కు ప‌ట్టున్న ఆత్మ‌కూరు నుంచి పోటీ చేయాల‌ని భావించినా.. అక్క‌డ వైసీపీనేత మేక‌పాటి గౌతం రెడ్డి ఉండ‌డంతో క‌నీసం వెంక‌ట గిరి నుంచి అయినా టికెట్‌ను ఆశించారు. 


ఆనంకు ఆత్మ‌కూరులో తిరుగులేని ప‌ట్టు ఉంది. అయితే ఆనం పార్టీ మారే క్ర‌మంలో జ‌గ‌న్‌ను క‌లిసిన‌ప్పుడు ముందుగా ఆత్మ‌కూరు సీటే అడిగారు. అయితే అక్క‌డ జ‌గ‌న్‌ను న‌మ్ముకున్న మేక‌పాటి ఫ్యామిలీకి చెందిన గౌతంరెడ్డి ఎమ్మెల్యేగా ఉండ‌డంతో జ‌గ‌న్ ఆనంకు మ‌రో సీటు కోరుకోవాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలోనే వెంక‌ట‌గిరి సీటు విష‌యం వీరి మ‌ధ్య ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. అయితే, ఇప్పుడు అది కూడా ద‌ర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక్క‌డ పోటీగా మాజీ సీఎం నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి కుమారుడు రాం కుమార్ రెడ్డి వైసీపీలోకి చేరి.. పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి కూడా ఆనంకు టికెట్ ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆనం ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: