తెలుగునాట పుట్టిన భారతస్వాతంత్ర సంగ్రామ యోధులలో మొదటగా చెప్పుకోవలసి వస్తే ప్రకాశం పంతులు.  బ్రిటీష్ సైన్యానికి రొమ్మువిరిచి ఎదురుగా నిలబడి దమ్ముంటే గుండెలపై కాల్చండి రా అంటూ సవాల్ చేశారు.  ఆయన ఒంగోలుకు సమీపాన గల వినోదరాయుని పాలెము గ్రామములో ఒక పేద బ్రాహ్మణ కుటుంబములో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు ఆగస్టు 23, 1872లో జన్మించాడు. పదకొండేళ్ల వయస్సులో తండ్రి మరణించగా తన గురువు హనుమంతరావు నాయుడు గారి వెంట రాజమండ్రి చేరాడు. అక్కడ చదువుకుంటూ గురువుగారితో పాటు గయోపాఖ్యానం వంటి పౌరాణిక నాటకాలలో వేషాలు వేసేవాడు. నాటకాల్లో ఆయన వేసే పాత్రలకు ప్రాణం పోసేవారు..అందుకే అప్పట్లో ప్రకాశం పంతులు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Image result for prakasam pantulu
చిన్నప్పటినుంచే లాయరుగా స్థిరపడాలని బలమైన కోరిక ఉండేది కానీ మొదట్లో మెట్రిక్యులేషన్ పరీక్ష తప్పి ఆ తరువాత మద్రాస్  వెళ్లి చదువు కొనసాగించి రాజమండ్రి వచ్చి ఒక చిన్న లాయర్గగా  వృత్తి ప్రారంభించి అనతికాలము లోనే ఒక విజయవంతమైన లాయర్ గా స్థిరపడ్డాడు, 31 ఏళ్ల వయస్సుకే 1904లో క్లిష్టమైన పోటీని తట్టుకొని రాజమండ్రి మునిసిపల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.  గాంధీ గారి  లాగానే ప్రకాశము గారు అయన తల్లికి మాంసము, మద్యము ముట్టనని ప్రమాణము చేసి ఇంగ్లండ్ బారిస్టర్ చదవటానికి 1904లో వెళ్ళాడు. ఇంగ్లాండ్ లో ఉండగానే దాదాభాయి నౌరోజీ హౌస్ అఫ్ కామన్స్ కు ఎన్నిక అవటానికి కృషి చేశాడు.

న్యాయవాద వృత్తిలో దేశము మొత్తములో ఈయనకు సాటిగా నిలవ గలిగిన న్యాయవాదులు ఇద్దరే ఒకరు చిత్తరంజన్ దాస్, రెండవవాడు మోతిలాల్ నెహ్రు. జాతీయ ఉద్యమాన్ని నడిపించే  చంద్ర పాల్ మద్రాస్ వచ్చినప్పుడు అయన సభలకు ఏమాత్రము జంకు లేకుండా అధ్యక్షత వహించేవాడు. అప్పటినుంచి  కోట్లు సంపాదించిపెట్టే న్యాయవాద వృత్తిని వదిలి స్వాతంత్రోద్యమం చురుకుగా పాల్గొనేవాడు. స్వరాజ్ పత్రికను ఇంగ్లిష్ తెలుగు, తమిళములలో ప్రచురించేవాడు 1921లో అహమ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలకు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు.    1922లో గుంటూరు లో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 30,000 వేల కార్యకర్తలతో నిర్వహించాడు.

ఈయన రాజకీయ రంగ ప్రవేశముతో అంతవరకూ ముందు వరుసలో ఉన్న కొండా వెంకటప్పయ్య గారు, ఉన్నవ  లక్ష్మీనారాయణ గారు, అయ్యదేవర కాళేశ్వర రావు గారు వంటి ప్రభూతులు వెనుక వరుసలోకి వెళ్లారు. 1928 ఫిబ్రవరి 3 న సైమన్ కమీషన్ మద్రాస్ వచ్చినప్పుడు సైమన్ గో బ్యాక్ అని పెద్ద ఎత్తున ఉద్యమము నడిచింది. అప్పుడు పోలీసులు ఉద్యమాలకు, ప్రదర్సనలకు అనుమతి ఇవ్వలేదు. మద్రాస్ హైకోర్టు వద్ద  అధిక సంఖ్యలో గుమికూడిన ప్రదర్శకులను అదుపు చేయటానికి పోలీసులు కాల్పులు జరపగా పార్ధసారధి అనే యువకుడు మరణించాడు. అప్పుడు ఉగ్రుడైన ప్రకాశము గారు చొక్కా చించుకొని చాటి చూపిస్తూ తనని కాల్చమని పోలీసులను సవాలు చేశాడు. ఆయన వెనక ఉన్న అశేష జనవాహినిని చూసి పోలీసులే వెనక్కు తగ్గారు. ఆ సంఘటనతో ఆయనకు ఆంధ్ర కేసరి అనే పేరు వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: