విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు. ఈ పేరు తలచుకుంటే చాలు పిరికి వాడికి కూడా ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. తెగువ, పోరాటానికి ఆయన మారు పేరు.  1897 జూలై 4న విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం పాండ్రంగి గ్రామంలో పుట్టిన అల్లూరి మన్యం వీరుడుగా పేరు గడించారు. పదకొండేళ్ళ ప్రాయంలోనే తండ్రిని కోల్పోయిన అల్లూరి మేనమామ చెంతకు చేరాడు. చదువులో పెద్దగా ఇష్టం లేకుండేది. అదే సమయంలో తోటివాడికి ఏదో చేయాలని తపన ఉండేది. 


మన్యానికి ధైర్యం నేర్పాడు :


దాంతో ఆయన విశాఖ మన్యంలో ఎక్కువగా తిరిగేవాడు. అక్కడ గిరిజనులను బ్రిటిష్ అధికారులు వేధిస్తున్న దాన్ని కళ్ళారా చూసిన అల్లూరి వారిపై తిరగబడమని గిరిజనులను చైతన్యం చేశాడు. ఆ తరువాత ఆయనే నేరుగా రంగంలోకి దిగి విల్లంబులు చేత బట్టి గెరిల్లా పోరాటాలకు తెగించాడు. అల్లూరి ధాటికి బ్రిటిష్ సైన్యం ఉక్కిరిబిక్కిరి అయింది. ఎపుడు ఎక్కడ దాడి చేస్తారో తెలియక తెల్ల దొరలు హడలి చచ్చేవారు. అల్లూరి సాహసాలను జనం కధలుగా చెప్పుకునేవారు. అల్లూరికి వెతికి పట్టుకున్న వారికి పెద్ద ఎత్తున బహుమానం కూడా నాటి ఆంగ్లేయ  ప్రభుత్వం ప్రకటించింది. క్రిష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పై దాడులు చేసి అల్లూరి తెల్ల పోలీసులను గడగడలాడించాడు. 


గడగడలాడిన తెల్ల దొరలు :


దీంతో అల్లూరి విరోచితంగా నాలుగేళ్ళపాటు బ్రిటిష్ దొరలపై అలుపెరగని పోరు చేశాడు. దెబ్బకు తెల్ల ప్రభుత్వం వణికిపోయింది. అల్లూరిని ఎలాగైన తుద ముట్టించాలని  బ్రిటిష్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకోసం ముల్లును ముల్లుతోనే తీయాలని కుట్రకు తెర తీసింది. అల్లూరి పక్కనున్న వారినే మచ్చిక చేసుకుంది. అలా వారి నుంచే కీలకమైన సమాచారం రాబట్టుకుని అల్లూరి మొత్తం కూపీ లాగింది. ఇంకోవైపు అల్లూరి కోసం ఏకంగా గిరిజనులను చిత్ర హింసలు గురి చేశారు. 


కుట్రతో తుదముట్టించారు.


దాంతో విచలితుడైన అల్లూరి తానుగానే లొంగిపోవాలని నిర్ణయించుకుని ఓ రోజు స్వయంగా తానే కబురు పంపి దొరికిపొయారని చెబుతారు. అలా విశాఖ జిల్లా ఏజెన్సీకొయ్యూరులో  అల్లూరిని ఒక చెట్టుకు కట్టేసి మరీ కాల్చి చంపేసారు. కేవలం ఇరవయ్యారేళ్ళ ప్రాయంలో 1924 మే 7న అల్లూరి బ్రిటిష్ వారిచే హత్య కావించబడ్డాడు. దేశం కోసం అసువులు బాసిన అమర జీవి మన అల్లూరి.



మరింత సమాచారం తెలుసుకోండి: