విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ గనుల తవ్వకాలపై  కేంద్రం అనుమతులు ఇచ్చిందంటూ పార్లమెంట్ లో కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థీ భాయ్ చౌదరి ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ సంస్థ నాల్కోకు అనుమతులు ఇస్తామంటూ ప్రకటించారు. ఇది ఇపుడు పచ్చని గిరి సీమలలో అగ్గి రాజేస్తోంది.


ఇద్దరూ కూడబలుక్కుని :


విశాఖలో బాక్సైట్ తవ్వకాలను టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు పూర్తిగా వ్యతిరేకించింది. అప్పట్లో వైఎసార్ ప్రభుత్వం దీనిపై ముందుకెళ్తే  ఉద్యమాలు చేసింది. అయితే 2014లో అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించింది.  గనుల తవ్వకాలు అనుకూలంగా జీవోలూ విడుదల చేసింది. దీనిపై విశాఖ ఏజేన్సీలో ఉన్న అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  బాక్సైట్ జోలికి వస్తే బాబును తరిమికొడతామని గట్టి వార్నింగులే ఇచ్చారు. ఇపుడు ఈశ్వరి  టీడీపీలో ఉన్నారు. మరి.  అందువల్ల బాక్సైట్ గనుల తవ్వకాలపై మౌనం వహిస్తున్నారు.


రెడీ అంటున్నారు :


విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తామని గిరిజన సంఘాలు అంటున్నాయి. మరో వైపు ప్రజా సంఘాలు, వామ పక్షాలూ ఉద్యమాలకు రెడీ అంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలసి ఇలా చేస్తున్నాయని మండిపడుతున్నారు. మొత్తానికి పచ్చని మన్యంలో రేగిన చిచ్చు ఆగేట్లు లేదు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అంతా కలసి  గట్టిగా  కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: