సమాజంలో నైతిక విలువలు పూర్తిగా అణగారిపోయాయి. మంచి అన్న మాటకు విలువే లేకుండా పోయింది. అడ్డ దారులే రహదారులుగా మారిపోతున్నాయి. ఏమైనా చెయ్..దోచెయ్ నాలుగు కాసులు వెనకేసుకుంటే నీ కంటే మొనగాడు ఎవడూ లేడు. అందరూ నీకున్న డబ్బుని చూసి నిన్ను  నెత్తిన పెట్టుకుంటారు. ఇపుడు సాగుతున్న నయా నీతి అదే. ఎంతో ఘన చరిత్ర ఉన్న భారతదేశం, సంస్కుతి, సంప్రదాయాలు, నీతి, నియమాలతో   ప్రపంచానికే ఆది గురువు అయిన మన భారతావని ఇపుడు నైతికత లోపించి విలవిల్లాడుతోంది.


అంతటా అరాచకమే :



దేశంలో అంతటా అరాచకమే రాజ్యమేలుతోంది. పై నుంచి దిగువ వరకు నీతిని పాటించేవాడే లేడు, పాతరేసేవాడు తప్ప.  ఎవడైనా నీతి చెబితే వాడిని వెర్రి వెంగలప్ప కింద జమ కడుతున్నారు. అవినీతి విశ్వరూపం దాల్చింది. ఎటు చూసినా అదే కనిపిస్తూ కరాళ న్రుత్యం చేస్తోంది. కష్టపడిన వాడిని చేతగాని వాడంటున్నారు. కష్టాన్ని దోచుకున్న వాడికి జేజేలు కొడుతున్నారు. నీతిగా వుంటే నిట్టూర్పులే మిగులుతున్నాయి. నిజాయతీకి అర్ధాలే మారిపోతున్నాయి.


వారినే వేధిస్తున్నారు :



ఒకనాడు ఈ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే పించన్ కోసం వారినే లంచం అడుగుతున్నారు. చేతిలో పైసా లేనిదే పని కాదంటున్నారు. వారి సేవలకు మెచ్చి ప్రభుత్వం ఇచ్చిన భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార మదంతో జులుం చేస్తున్నారు. ఇవన్నీ  చూసిన భారత మాతకు ఏడుపు కాక ఇంకేం మిగులుతుందని. దారితప్పిన బిడ్డలను చూసి విలపించడం తప్ప చేసేదేముందని.


వాళ్ళే నయమా :



ఈ దేశంలో ఏడు దశాబ్దాలుగా ఎంత వరకూ  అభివ్రుధ్ధి జరిగిందో కానీ, ఇప్పటికీ తాతలు, నాటి నుంచి నేటి వరకూ దేశాన్ని చూస్తున్న పెద్దలు అనే మాట ఏంటంటే వాళ్ళేనయం అని. ఇది నిజంగా మన స్వాతంత్రానికే తల వంపులు, పోరడిన నాయకులకే అవమానం. కానీ ఈ మాటను వాడుతున్న వారు ఎంతో జీవితం చూసిన వారు. నాటికీ, నేటికీ సరిపోల్చుతున్న వారు. మనం ఎవరినైతే వద్దు అనుకుని ఈ దేశం నుంచి తరిమికొట్టామో వారిన పొగిడిన  రోజున ఈ స్వేచ్చకు అర్ధం ఏముంటుంది.



నల్ల దొరలు వారిని మించిపోయారంటే అది దేశభక్తులనే వంచించినట్లు కాదా మరి. ఈ దేశం మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందా. నైతిక విలువల పునరుధ్ధరణ జరుగుతుందా, నిజాయతీకి మచ్చుతునకగా మారుతుందా.. ఇప్పటికైతే నిరాశే. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: