రాజ్య‌స‌భ్య డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థిగా జేడీయూకు చెందిన హ‌రివంశ్ నారాయ‌ణ, విప‌క్షాల కూట‌మి అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ బీకే హ‌రిప్ర‌సాద్ బ‌రిలో నిలిచారు. ఈ నెల 9న ఉద‌యం 11గంట‌ల‌కు ఈ ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అయితే, ఈ ఎన్నిక‌ల్లో ఇరు వ‌ర్గాల‌కు పూర్తిస్థాయి మెజారిటీ లేక‌పోవ‌డంతో అంద‌రిలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఈ ఎన్నిక‌లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారుతున్నాయి. గెలుపు కోసం ఇప్ప‌టికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయి. అయితే, ఇందులో త‌ట‌స్థంగా ఉన్న పార్టీల ఓట్లే కీల‌కంగా మారుతున్నాయి. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల ఓటింగ్ లో పాల్గొనే అవ‌కాశం కేవ‌లం రాజ్య‌స‌భ స‌భ్యుల‌కు మాత్ర‌మే ఉంటుంది. 

Image result for హ‌రివంశ్ నారాయ‌ణ

ప్రస్తుతం రాజ్య‌స‌భ‌లో 244 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు అవ‌స‌రం. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే-12,  బీజేడీ-9, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌-1,  పీడీపీ-2,  శివసేన-3, టీఆర్‌ఎస్‌-6,  వైఎస్సార్‌సీపీ-2లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి. ఇప్ప‌టికే జేడీయూ అధినేత‌, బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీర్‌కు ఫోన్ చేసి మ‌ద్ద‌తు కూడా కోరారు. అంతేగాకుండా.. బీజేడీ అధినేత‌, ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్‌ప‌ట్నాయ‌క్‌కు కూడా ఫోన్ చేసి మ‌ద్ద‌తు కోరారు. దాదాపుగా వీరిద్ద‌రూ ఎన్డీయే అభ్య‌ర్థికే మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. 

Image result for హ‌రివంశ్ నారాయ‌ణ

అయితే, ఎన్డీయేలో కొన‌సాగుతూ... శివ‌సేన పార్టీ బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తోంది. మోడీని ఏకిపారేస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. ఇక‌ కాంగ్రెస్‌ పార్టీ సినియర్‌ నేత, ఎంపీ బీకే హరిప్రసాద్‌ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సీపీఐ నేత డీ. రాజా ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం క‌నిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్ బీజేడీ నేత‌, ఒడిశా ముఖ్య‌మంత్రి నవీన్‌ పట్నాయక్‌ మద్దతు కోరగా...  తాము ఇప్ప‌టికే జేడీయూ అభ్యర్ధికి మద్దతు ఇస్తామని నితీష్‌కు మాట ఇచ్చినట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌లు అన్నిపార్టీల్లో ఉత్కంఠ‌ను రేపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: