రాజ‌కీయాల్లో అందునా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో మూడు ఓట్లే ముఖ్యం. పోనీ.. మూడు నియోజ‌క‌వ‌ర్గాలే అయినా అత్యంత ప్ర‌ధానం! అలాంటిది.. వైసీపీకి ఇప్పుడు మూడు జిల్లాల్లో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఫ‌లితంగా జ‌గ‌న్ ల‌క్ష్యమైన అధికార పీఠంపై పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి, విశాఖ జిల్లాల్లో వైసీపీకి ఇప్పుడు ఎదురు గాలి వీస్తోంద‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌నేన‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని జ‌గ‌న్ ఎంతో కృషి చేస్తున్నారు. 


2014లో కొద్ది తేడాతో కోల్పోయిన అధికారాన్ని ఇప్పుడు సాధించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. రెండు రూపాల్లో ఇది ఇప్పుడు ఆయ‌నకు అత్య‌వ‌స‌రం. పార్టీ కేడ‌ర్‌ను నిలుపుకోవ‌డం స‌హా పార్టీని ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కించేందుకు కూడా ఇది అత్య‌వ‌స‌రం. ఈ నేప థ్యంలోనే ఆయ‌న ఆరోగ్యాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర చేస్తున్నారు. గ‌త ఏడాది న‌వంబ‌రులో ప్రారంభించిన ఈ యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. అయితే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు జైకొట్టిన మూడు జిల్లాల్లో వైసీపీ నాయ‌కులు ఇప్పుడు డోలాయ‌మానంలో ప‌డ్డార‌ని తెలుస్తోంది. 


ముఖ్యంగా కాపు సామాజిక‌వర్గం డామినేష‌న్ ఎక్కువ‌గా ఉన్న ఈ మూడు జిల్లాల్లోనూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌భావం తీవ్రంగా క‌నిపిస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సానుభూతి కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల మూలంగా కొట్టుకు పోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎం కావ‌డానికి ఈ మూడు జిల్లాలు ఎంతో స‌హ‌క‌రించాయి. మ‌రి ఈ జిల్లాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని ముందుకు సాగ‌డంలో జ‌గ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నార‌ని, కొన్ని విష‌యాలు నిజాలే అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా లౌక్యం చూపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, కానీ, త‌మ నేత అలా చేయ‌డం లేద‌ని కాపు వ‌ర్గానికి చెందిన కొంద‌రు సీనియ‌ర్లే చెబుతుండ‌డం ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. 


కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అంశం అనేది కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న విష‌య‌మేన‌ని, ఇప్పుడు కొత్త‌గా తెర‌మీదికి వ‌చ్చింది లేద‌ని, అంద‌రూ దీనిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటుంటే.. జ‌గ‌న్ మాత్రం నిష్క‌ర్ష‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, వ్యాఖ్యానించ‌డం వ‌ల్ల ఆయా వ‌ర్గాల‌కు దూర‌మ‌వుతున్నార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపును ప్ర‌భావితం చేసే ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి జిల్లాలు స‌హా విశాఖ‌లో కాపుల‌ను ఇప్ప‌టికైనా వైసీపీ ప‌క్షానికి తిప్పుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వారు జ‌గ‌న్‌కు ప‌రోక్షంగా సూచిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ వారి సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ముందుకు సాగుతారో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: