వైసీపీలో టికెట్ల వార్ ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతోంది. సిట్టింగ్‌ల‌కే మ‌ళ్లీ సీటు ఇస్తామ‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌క‌పోవ‌డంతో టికెట్ ఆశిస్తున్న నేత‌లు ఎవ‌రి వ్యూహాల్లో వారు మునిగి తేలుతున్నారు. టికెట్ ద‌క్కించుకునేందుకు వ్యూహాలు ర‌చించ‌డంతో పాటు ఎవ‌రికి వారు తమ‌దే టికెట్ అని ప్ర‌క‌టించేసుకుని ఆ విధంగా ముందుకు వెళిపోతూ.. ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేస్తున్నారు. ఇదే అదునుగా ఇత‌ర పార్టీలు కూడా ఆఫర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావ‌లి వైసీపీలో మూడు ముక్క‌లాట మొద‌లైంది. ఒకే టికెట్ కోసం పార్టీలోని ముగ్గురు నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇద్ద‌రు ఎర్త్ పెట్టేందుకు రెడీ అయిపోయారు. వైసీపీలో జ‌రుగుతున్న పోరు.. ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న ఇత‌ర పార్టీల నేత‌లు వీరిలో ఎవ‌రో ఒక‌రిపై ఆశ‌లు పెట్టుకున్నాయి. `అక్కడ కాకపోతే ఇక్కడకు రండి..` అంటూ వల విసురుతున్నాయి. 


కావలి వైసీపీ అభ్యర్థి నేనంటే నేనేనని ఆ పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేస్‌లో ఉండటం ఏమిటీ అభ్యర్థిని నేనే అని మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్థన్‌రెడ్డి ప్ర‌క‌టించుకున్నారు. టిక్కెట్టు విషయంలో పార్టీ అధినేత జగన్‌ తనకు మాట ఇచ్చారని, ఆయన మాట తప్పే వ్యక్తి కారని విశ్వాసం ప్రకటించారు. ఆయన ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కావలి నియోజకవర్గం పరిధిలోని దగదర్తి, బోగోలు, అల్లూరు మండలాల్లో బలమైన అనుచరగణం ఉంది. వైసీపీ స్థాపించిన తొలి రోజుల్లో జిల్లా నుంచి ఆ పార్టీలో చేరిన తొలినాయకుడీయనే. 2014 ఎన్నికల్లో టికెట్టు రాకున్నా వైఎస్సార్‌ కుటుంబంతో ఉన్న అనుబంధం, బీద సోదరులతో ఉన్న వైరం నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. త‌ర్వాత వైసీపీలో విష్ణు పరిస్థితి మారింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి ఆయనకు మధ్య వైరం ముదిరింది. 


ఎమ్మెల్యే కోరిక మేరకు విష్ణు అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీనిని ఎత్తివేయించుకోవడం కోసం విష్ణువర్ధన్‌రెడ్డి ఎంతో ప్రయత్నించినా జ‌ర‌గ‌క‌పోవడంతో జగన్‌ పాదయాత్రకు సైతం దూరంగా ఉండి పోయారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిశ్చయించుకున్నారు. వైసీపీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక వనరులను కూడా సమీకరించుకుంటున్నా రు. ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్‌రెడ్డికి సమాంతరంగా రాజకీయ కార్యకలా పాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి కూడా టికెట్టు కోసం పోటీ పడుతున్నారు. 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో చేరి అక్కడే కొనసాగుతున్నారు. చంద్ర బాబుతో వ్యక్తిగత అనుబంధం ఉన్నా, తన రాజకీయ గురువు ఆదాల ప్రభాకరరెడ్డి టీడీపీ తరపున పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసినా కూడా ఆయన మాత్రం వైసీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. 
 

సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రతా ప్‌రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థనరెడ్డికి మధ్య ముదిరిన వైరం త‌న‌కు లాభిస్తుంద‌ని యోచి స్తున్నారు. వీరిద్దరి ఆశలు ఎలా ఉన్నా, కావలి టికెట్టుపై సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టికెట్‌ విషయంలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ముందే గ్రహించిన ప్రతాప్‌రెడ్డి జిల్లాలో ముఖ్య నేత లను త‌న‌వైపు తిప్పుకొనేలా చేశారు. జగన్‌ పాద యాత్ర సందర్భంగా కావలి పర్యటనలో వైసీపీ ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి తదితరులతో ప్రతాప్‌రెడ్డే రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారని ప్రకటింపజేసుకున్నారు. విష్ణు వర్థన్‌ రెడ్డిని తమ వైపు ఆకర్షించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయ‌న‌తో రాయబారాలు నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వంటేరు వేణుగోపాల్‌రెడ్డిపైనా ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: