దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన గొప్ప రోజున ప్రధాని, ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా సాగాయి. నాలుగున్నరేళ్ళలో చేసిన అభివ్రుధ్ధిని చెప్పుకోవడంతో పాటు హామీలన్నీ నిలబెట్టుకున్నట్లుగా నరేంద్ర  మోడీ,చంద్రబాబు చెప్పుకున్నారు. ఈ రోజు ఎర్ర కోటపై మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగమైనా, శ్రీకాకుళం వేదికగా బాబు ఇచ్చిన ఉపన్యాసమైనా రెండూ టార్గెట్-2019 గానే సాగడం విశేషం.


రిస్క్ చేశానన్న మోడీ :


గత ప్రభుత్వాలు చెయలేని, మూలన పెట్టిన అనేక పనులను తమ ప్రభుత్వం తలకెత్తుకుందని, వాటిని పూర్తి చెయడం వెనక రిస్క్ ఉన్నా కూడా దేశ హితం కోసం భరించి చేసామని మోడీ చెప్పుకున్నారు. ఉదాహరణగా జీఎస్టీ బిల్లుతో పాటు, బ్యాకింగ్ వ్యవస్థలో సంస్కరణలు , సర్జికల్  స్ట్రైక్స్   వంటివి తమ ప్రభుత్వం అసాధరణ విజయాలుగా మోడీ అభివర్ణించారు. 
అలాగే సాయుధ దళాలకు వన్ ర్యాంక్, వన్ పెన్షన్ విధానం, రైతుల పెట్టుబడికి ఒకటిన్నర మద్దతు ధర వంటివి తన క్రెడిట్ గా చెప్పారు.

ఇక ఎస్సీ , ఎస్టీ చట్టాన్ని మరింతగా పటిష్టం చేయడం, బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించడం వంటివి ఘనతగా చెప్పారు.  2022లో అంతరిక్షానికి భారతీయున్ని పంపుతామని చెప్పడం ద్వారా మళ్ళీ వచ్చేదీ తానేనని కడు ధీమాగా మోడీ ఎర్ర కోటపై నుంచి ప్రకటించుకున్నారు.


కులాలపై వల :


ఇక ఏపీ సీఎం తన ప్రసంగంలో కాపుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. వారికి వేయి కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు చేశామని, బీసీలలో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేశామని చెప్పడం విశేషం. అలాగే బ్రాహ్మణుల కోసం 210 కోట్లను ప్రత్యేక కార్పోరేషన్ కి ఇచ్చామన్నారు, మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తామని మరో మారు హామీ ఇచ్చారు. వారితో పాటు రజకులనూ ఎస్సీ జాబితాలో చేరుస్తామని హామీ ఇవ్వడం ద్వారా ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఎవరు సహకరించకున్నా ఏపీని ముందుకు తీసుకుపోతామని చెప్పడం ద్వారా పరోక్షంగా మోడీ సర్కార్ కి చురకలు అంటించారు. మొత్తానికి ఇద్దరు నాయకులు తమ ప్రసంగాల ద్వారా టార్గెట్ ఏంటన్నది చెప్పేశారంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: