రాజ‌కీయ అప‌ర చాణిక్యుడిగా పేరు పొందిన సీఎం చంద్ర‌బాబు తాజాగా రాజ‌ధానిని విక్ర‌యించేశారు! ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఇది నిజం అంటున్నారు ఆర్థిక నిపుణులు! రాజ‌ధాని బాండ్ల పేరుతో ఆయ‌న చేసిన మేజిక్ తాత్కాలికంగా రాజ‌ధానికి ఆర్థిక వెసులుబాటు క‌ల్పించింది. రూ.1300 కోట్ల సేకరణ కోసం నిర్వహించిన‌ బాండ్ల బిడ్డిం గ్  కేవలం గంట వ్యవధిలో రూ.2,000 కోట్ల బాండ్లు అమ్ముడు పోయాయి. వాస్త‌వానికి ఏ పెట్టుబ‌డి దారుడైనా ఊరికేనే త‌మ వ‌ద్ద ఉన్న సొమ్మును పెట్టుబ‌డిగా పెట్ట‌రుక‌దా?! రాజ‌ధాని బాండ్ల విష‌యంలోనూ అదే జ‌రిగింది. బ్యాంకుల క‌న్నా కూడా అత్య‌ధిక వ‌డ్డీల‌ను ఇస్తామ‌ని చేసిన ప్ర‌క‌ట‌న ద్వారానే ఇప్పుడు బాండ్ల‌కు ఇంత ఊపు వ‌చ్చింద‌నేది  వాస్త‌వం. 


అయితే, ఈ రాజధాని బాండ్ల విక్రయంతో ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదనేది ఆర్థిక విశ్లేష‌కుల మాట‌! బ్యాంకు వడ్డీ కంటే అధికంగా చెల్లిస్తామని విక్రయాలు చేపడుతున్నారని.. దీని వల్ల ప్రజలపై భారీగా భారం పడే అవకాశముందని కూడా వారు చెబుతున్నారు.  షేర్‌ మార్కెట్‌లో ఓవర్‌ సబ్‌స్రైబ్‌ మంచిదే కానీ బాండ్ల విక్రయంలో మంచిది కాదన్నారు. రూ.60 వేల కోట్లతో ఎలక్షన్ సంవ‌త్స‌రంలో టెండర్లు పిలవడం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారీగా భారం పడుతుందని అంటున్నారు.  బాండ్ల ద్వారా వచ్చేదంతా అప్పే అవుతుందని, మళ్లీ రీయింబర్స్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలపై భవిష్యత్‌లో పెద్ద భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, అధిక వడ్డీ చెల్లించినపుడు స్పందన బాగా ఉంటుంద‌ని కూడా చెబుతున్నారు. 


ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఆదాయం 29 శాతంగా ఉంది.. బాండ్ల ద్వారా వచ్చే రూ.60 వేల కోట్ల అప్పుతో ఆదాయంలో అప్పు శాతం 29 నుంచి 35 శాతానికి పెరుగుతుంది.  దీని వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోతుందనేది వాస్త‌వం. ఇది రాబోయే రోజుల్లో.. ప్రజలపై మరింత భారం పెంచే అవకాశముంది. నిజానికి ఇది అప్పు తీసుకోవ‌డంతోనే స‌మాన‌మ‌ని ఆర్థిక నిపుణుల విశ్లేష‌ణ‌. అదేస‌మ‌యంలో ఈ షేర్ల‌ను కొనుగోలు చేసిన వారిపైనా కొంత మేర‌కు నిఘా త‌ప్ప‌ద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. బాండ్ల విక్ర‌యం అంతా కూడా టీడీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌ని, బినామీ బాగోతం దాగి ఉంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నాయ‌కులు దొడ్డిదారిని ఆ నిధుల‌ను ఇప్పుడు బాండ్ల రూపంలో పెట్టుబ‌డులు పెట్టి ఉంటార‌నేది వీరి విమ‌ర్శ‌.


గ‌తంలోనూ చంద్ర‌బాబు ఇదేవిధంగా ఉమ్మ‌డి రాష్ట్ర అప్పును 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్ల‌కు చేర్చారు. ఇప్పుడు తాజాగా బాండ్ల రూపంలో నిధులు సేక‌రించి ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రంలో త‌న‌కు అనుకూల‌మైన విధానాల‌తో ముందుకు సాగి.. తిరిగి ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అనూహ్య‌మైన దారిని ఏర్పాటు చేసుకుంటున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌నే సాకుతో.. లేని దానిని తాక‌ట్టు పెట్ట‌డం ద్వారా వ‌చ్చే సొమ్ముతో సంత‌ర్ప‌ణ‌లు చేసేందుకు చంద్ర‌బాబు రెడీ అయ్యార‌ని అంటున్నారు. ఏదేమైనా.. రాజ‌ధాని బాండ్ బాజా.. ప్ర‌జ‌ల‌కు చేటు తెచ్చేదేనంటున్నారు విశ్లేష‌కులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: