మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ మేరకు ఈ రోజు  ఉదయం ఎయిమ్స్ వైద్యులు హెల్త్‌బులిటిన్ విడుదల చేశారు. ‘‘మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదు. ఇప్పటికీ విషమంగానే ఉంది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో చికిత్స అందిస్తున్నాం...’’ అని ఎయిమ్స్ మీడియా ప్రోటోకాల్ విభాగం చైర్మన్ డాక్టర్ ఆర్తి విజ్ వెల్లడించారు. ఇదిలా  మాజీ ప్రధాని ఆరోగ్యం అంతకంతకు క్లిష్టంగా మారుతుండడంతో... ఆయనను పరామర్శించేందుకు జాతీయ నేతలంతా ఎయిమ్స్‌కు తరలి వెళుతున్నారు. 


వాజ్‌పేయి నివాసం దగ్గర భద్రత పెంపు


బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ, బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు వాజ్‌పేయిని ఈ రోజు  పరామర్శింఛారు. యోగి ఆదిత్యనాథ్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా పలువురు ముఖ్యమంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఎయిమ్స్‌కు తరలి వెళ్ళారు. కాగా,  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నివాసం దగ్గర భారీగా భద్రతను పెంచారు. ఆయన నివాసానికి వెళ్లే మార్గంలో రోడ్లు మూసివేసి, పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు. వీఐపీలు తిరిగే మార్గంలో కూడా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.


 
బర్త్‌డే వేడుకలు రద్దు ఛేసుకున్న కేజ్ర్రీ !


 ఆమాద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఏడాది తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విటర్లో వెల్లడించారు. వాలంటీర్లు, అభిమానులు తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి నివాసానికి కూడా ఎవరూ రావద్దంటూ ఆమాద్మీ పార్టీ తమ వాలంటీర్లను కోరింది. 
కాగా ఇవాళ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం కేజ్రీవాల్‌కు ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై కేజ్రీవాల్ రిప్లై ఇస్తూ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు కూడా ట్విటర్ ద్వారా కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: