నవ్యాంధ్ర రాజకీయం ఎపుడూ విలక్షణంగానే ఉంటుంది. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయాక అంతా అనుకున్నట్లుగా వైసీపీకి ఎంతో హైప్ ఉన్నా అనూహ్యంగా తెలుగుదేశం గెలిచింది. అలా ఏపీ ఓటర్లు ఎప్పటికపుడు వివేకవంతమైన తీర్పునే ఇస్తూ వస్తున్నారు. మరి 2019లో ఏం జరగబోతోంది...హంగ్ వస్తుందా..? కొన్ని పార్టీలు హంగ్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి.


మారిన రాజకీయం :


ఏపీలో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ ఉన్నాయి. మధ్యలో సినిమా నటుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన కూడా వచ్చి చేరింది. నిజానికి గత ఏడాది వరకూ ఎవరి నోటా హంగ్ అన్న మాట వినిపించలేదు. ఇపుడు జనసేన దూసుకురావడం, పాపులర్ సినిమా యాక్టర్ కావడం, పైగా ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో హంగ్ అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.ఇక ఏపీలో అనేక పార్టీలు ఈసారి పోటీలో ఉండబోతున్నాయి. టీడీపీ నుంచి విడిపోవడంతో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ కూడా తన ఉనికిని చాటుకునేందుకు సిధ్ధపడుతోంది. మరో వైపు వామ పక్షాలూ ఉన్నాయి. ఇంకా ఇతర పార్టీలూ రేసులో ఉన్నాయి. పోటీ టీడీపీ, వైసీపీ అయినా ఇతర పార్టీలూ కొన్ని చోట్ల ప్రభావవంతమైన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.  


హంగ్ ఆర్భాటం  :


ఏపీలో హంగ్ వస్తుదన్న మాట చాలా కాలంగా రాజకీయ  పార్టీలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి ఈ మాట తరచూ అంటున్నారు. ఇక రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధి కూడా మేము ఏపీలో కీ రోల్ ప్లే చేస్తామన్నారు. దాని అర్ధం హంగ్ వస్తుందనే. ఇంకో వైపు జనసేనాని పవన్ తాను తప్పక సీఎం అవుతానంటున్నారు. ఆయన ఆశలూ హంగ్ పైనే ఉన్నాయి. 


కొట్టిపారెస్తున్నారు :


ఇక ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ హంగ్ రానే రాదని, మరో మారు చంద్రబాబు మంచి మెజారిటీతో సీఎం అవుతారని గట్టిగా చెబుతోంది. ఇంకో వైపు వైసీపీ అదే మాట అంటోంది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హంగ్ ప్రసక్తే లేదని విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వైసీపీకి 130కి పైగా సీట్లు వస్తాయంటూ లెక్కలు కూడా చెప్పారు.


మ్యాజిక్ అక్కడే :


ఏపీలో ఏ పార్టీ సర్కార్ ఏర్పాటు చేయాలన్నా 175లో  సగానిక్ కంటే ఎక్కువ సీట్లు అంటే 88 రావాలి, దాన్ని మ్యాజిక్ ఫిగర్ అంటారు. పోయిన ఎన్నికలలో టీడీపీకి 102 సీట్లు వచ్చాయి, వైసీపీకి 68 వచ్చాయి. బీజేపీకి నాలుగు, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. అప్పట్లో కూడా హంగ్ అన్న మాట వచ్చినా ఓటర్లు ఒకే పార్టీకి పట్టం కట్టారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని అంటున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలూ  అంటూ ఎన్ని కబుర్లు చెప్పినా  ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పోలరైజేషన్ జరుతుందని, ఎవరు పవర్ లోకి వస్తారన్నది ఓ అంచనా ఏర్పడుతుందని, దానిని బట్టి   మెజారిటీ ఓటింగ్  ఆ వైపుగా మారుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: