ప‌వ‌న్ మాట‌ల‌కు చేత‌ల‌కు పొంత‌న‌లేకుండా పోతోందా..? జ‌న‌సేన కుల‌ద‌ళంగా మారుతోందా..?  మొద‌టి నుంచీ జెండాల‌ను మోసిన వారికి గుండుసున్నాలు పెడుతున్నారా..?  పీఆర్పీ బ్యాచ్‌కే పార్టీ ప‌ద‌వుల్లో పెద్ద‌పీట వేస్తున్నారా..?  ఇటీవల ఏడు జిల్లాల బాధ్యుల నియామ‌కం ఇదే చెబుతోందా..? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. నీ.. నా.. సొంత‌, ప‌రాయి అనే బేధం లేకుండా..కులాలు, మ‌తాల‌కు అతీతంగా జ‌న‌సేన ప‌నిచేస్తోంద‌ని ప‌దేప‌దే చెబుతున్న ప‌వ‌న్ కూడా కుల‌బంధ‌నాల్లో ఇరుక్కుపోతున్నార‌నే టాక్ పార్టీవ‌ర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డుతున్న‌వారిని కాద‌నీ.. సొంత సామాజిక‌వ‌ర్గాన్ని ఆయ‌న ద‌గ్గ‌ర‌కు తీసుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప‌రిణామాలు పార్టీ క్యాడ‌ర్‌ను తీవ్ర క‌ల‌వ‌రానికి గురిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 


నిజానికి ప‌వ‌న్ తీరు మొద‌టి నుంచీ కొంత విచిత్రంగానే క‌నిపిస్తోంది. జ‌న‌మే ప్రాణంగా ఉంటాన‌ని చెప్పిన ప‌వ‌న్ అందుకు భిన్నంగా ముందుకు వెళ్తున్నార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. వచ్చే ఎన్నిక‌ల్లో 175స్థానాల్లో బ‌రిలోకి దిగుతామ‌ని ఆయ‌న అంటున్నారు. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న కేవ‌లం త‌న సొంత సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉన్న ఉత్త‌రాంధ్ర చుట్టే తిరుగుతున్నారు. ఎక్కువ‌గా ఈ ప్రాంతంలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌తో స‌మావేశం అవుతున్నారు. ఇదంతా కూడా త‌న సొంత సామాజిక‌వ‌ర్గం మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికే ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నీ.. ఇలాంటి ప‌రిస్థితుల్లో మిగ‌తా సామాజిక‌వ‌ర్గాల‌ను ఆయ‌న ఏం ప‌ట్టించుకుంటార‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. 


ఇదిలా కొన‌సాగుతుండ‌గానే.. ఇందుకు బ‌లాన్ని ఇచ్చేలా పార్టీ బాధ్యుల నియామ‌కాలు ఉండ‌డం గ‌మ‌నార్హం. పార్టీతో పెద్ద‌గా సంబంధాలు లేని ప‌లువురు కార్పొరేట్‌స్థాయి వ్య‌క్తుల‌కు కూడా ప‌ద‌వులు ద‌క్కాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి.. ప‌వ‌న్ ఎప్పుడు మాట్లాడినా కొంత ఉద్వేగ‌పూరితంగా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న స్టార్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ పెట్ట‌గానే అభిమానులే కార్య‌క‌ర్త‌ల‌య్యారు. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు అదే ప్ర‌ధాన బ‌లం. అయితే.. 2014 నుంచీ కూడా ప‌లువురు పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. 


తీరా.. ప‌ద‌వుల వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి.. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీలో ప‌నిచేసిన బ్యాచ్‌కు, ఆయ‌న సొంత సామాజికవ‌ర్గానికి చెందిన వారికే పెద్ద‌పీట వేయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి, క‌`ష్ణా, గుంటూరు జిల్లాల‌కు క‌న్వీన‌ర్లు, జాయింట్ క‌న్వీన‌ర్ల‌ను నియ‌మించారు. ఇందులో దాదాపుగా 80శాతం ఆ బ్యాచే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లువురు నాయ‌కులు హైద‌రాబాద్‌లో ప‌వ‌న్‌ను క‌లిసి త‌మ బాధ చెబుదామ‌ని ప్ర‌య‌త్నం చేసినా కొంద‌రు అడ్డుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలో జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు ఆయ‌న వ‌చ్చిన‌ప్పుడే ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. 



మరింత సమాచారం తెలుసుకోండి: