అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు ఏడ్చినట్టుగా, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా.. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం నాయకుల స్పందన చాలా చాలా లేటుగా ఉంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అనే సీమాంధ్ర తెలుగుదేశం నేతలే ఈ విషయంపై చాలా లేటుగా రాజీనామాలు ఇస్తున్నారు. ఇప్పటికే సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెలువరిచి నెల గడిచిపోయింది, అప్పటి నుంచి సీమాంధ్ర ప్రజలు సమైక్య ఉద్యాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇంత జరిగాకా.. కానీ తెలుగుదేశం నేత యనమల రామృకృష్ణుడికి రాజీనామా చేయాలన్న ఐడియా రాలేదు.

దాని ద్వారా తన నిరసనను తెలపవచ్చని ఆయనకు తట్టలేదు. యనమల రామకృష్ణుడు సమైక్యాంధ్ర కోసం తన పదవికీ రాజీనామా చేశాడా..లేదా.. అనే విషయం ఇన్ని రోజులూ ఎవరికీ పట్టలేదు. అయితే ఉన్నట్టుండి ఆయన "నేను రాజీనామా చేస్తున్నాను..'' అని ప్రకటించాడు.ఆయన తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు.  ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తడితో పాటు, సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యనమల ప్రకటించాడు.

ఇప్పుడు యనమల రాజీనామా అనేది రాష్ట్రాన్ని సమైక్యంగాఉంచేదీ కాదు, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేదీ కాదు. ఇలాగే సైలెంట్ గా ఉండి ఉన్నా.. యనమలకు వచ్చే నష్టం ఏమీ ఉండేది కాదు. అయితే ఇంత లేటు స్పందించడం ద్వారా తాము రాష్ట్ర విభజన అంశం గురించి ఎంత బద్ధకంగా స్పందిస్తున్నామనే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చేస్తున్నారు తెలుగుదేశం నేతలు! 

మరింత సమాచారం తెలుసుకోండి: