ఆలయాలలో రాజకీయాలు ప్రవేశించిన తరువాత ఆధ్యాత్మికత పూర్తిగా అంతరించింది. పాలక మండళ్ళు అవతరించాక  పాపాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పేరుకు ధర్మ కర్తలు చేసేవి అధర్మ కార్యక్రమాలు. ప్రతీ రోజూ ఇది అంతా చూస్తూ ఉన్నదే. భక్తిని బంగారంగా మార్చుకునే నయా నాయకత్వపు రాజ్యాలలో దేవుళ్ళూ కళ్ళు మూసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.


శ్రీవారు  కొలువున్న చోట :


ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో తరచూ వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. అక్రమాలు, అవినీతి అంటూ పుంఖానుపుంఖాలుగా కధనాలు వెలువడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ప్రధాన అర్చకునిగా పనిచేసిన రమణ దీక్షితులు స్వామి వారి విలువైన ఆభరణాలు చాలా కైంకర్యం అయ్యాయని చేసిన ఆరోపణలకు ఎక్కడా ఇంతవరకూ సరైన జవాబు లేదు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారంటూ ఘాటు విమర్శలు చేసినా ఉలుకూ పలుకూ లేదు.


టిక్కెట్ల  కుంభకోణం :


ఇక లేటెస్ట్ గా టిక్కెట్ల కుంభకోణం వెలుగు చూసింది.  శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయడపడుతున్నాయంటున్నారు.  ఆన్‌లైన్ లక్కీడిప్ విధానంలో షోలాపూర్ దళారి ప్రతి నెలా 200ల వరకు సేవా టికెట్లు పొందాడట. గతేడాది నవంబర్ నుంచి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. షోలాపూర్‌ దళారి తరహాలో గుంటూరు, చెన్నైలో కూడా దళారులు సేవా టికెట్లు పొందారు. శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణంలో మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని భోగట్టా.



ఇక,సుప్రభాత సేవా టికెట్లను ఒకరి పేరుపై బుక్‌ చేసి ఇతరులకు అధిక సొమ్ముకు విక్రయిస్తున్న దందా  నిన్న శుక్రవారం బయటపడింది. అలా సుప్రభాత సేవా టికెట్లు పొంది నకిలీ ఆధార్‌తో స్వామి దర్శనానికి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.


దుర్గ గుడిలో ఇలా :


ఇదిలా ఉండగా మరో సుప్రసిధ్ధ పుణ్య క్షేత్రం విజయవాడ శ్రి కనకదుర్గమ్మ సన్నిధిలోనే అక్రమాలు యధేచ్చగా సాగుతున్నా పట్టించుకున్న నాధుడే లేడు. ఆ మధ్యన అమ్మ వారికి మొక్కు చెల్లించిన వేలాది రూపాయలు విలువ చేసే చీర దొంగతనం ఓ సంచలనం అయితే, దానికి మించిన మరో భాగోతాన్ని ఆ చీరల నేరం నెత్తికెత్తుకున్న కోడెల సూర్యలత వెల్లడించడం విశేషం. పవిత్ర ఆలయంలో లైంగిక కార్యక‌లాపాలు సాగుతున్నాయని సూర్యలత మీడియా ఎదుట షాకింగ్ నిజాలు చెప్పేశారు. ధర్మకర్తల మండలిలో సభ్యుడొకరు అక్కడ పనిచేసే వారిని లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై చైర్మన్ కి  బాధిత మహిళలు  ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.


ఇందులో నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇదే ఆలయంలో అంతకు ముందు క్షుద్ర పూజలు జరిగాయని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. చూడబోతే పవిత్ర ఆలయాలు తరచూ వివాదాల కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడ భక్తి వాతావరణం లేకుండా జరుగుతున్న ఘటనలు కలుషితం చేస్తున్నాయి. మరి వీటిని చూస్తూంటే తనను తాను కాపాడుకునేందుకు దేవుడే దిగి రావాలనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: