రాజ‌ధాని ప్రాంతానికి కొండ‌వీటి వాగు రూపంలో దెబ్బ ప‌డుతుందా ?  అమ‌రావ‌తికి  ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌తో జ‌నాల్లో ఆందోళ‌న మొద‌లైందా ? క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది. రాజ‌ధాని గ్రామాల్లో  గ‌డ‌చిన మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల కొండ‌వీటి వాగు పొంగిపొర్లుతోంది.  అంటే ఒక విధంగా అమ‌రావ‌తి ప్రాంత‌మంతా ముంపు ప్రాంతంలో ఉంద‌న్న‌మాటే. ఆ వాగు వ‌ల్లే అమ‌రావ‌తికి ప్ర‌మాద‌ముంద‌ని నిపుణులు, ఉన్న‌తాధికారుల్లో ఆందోళ‌న పెరిగిపోతోంది.   ప్ర‌భుత్వం కూడా రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిందంటే  ప‌రిస్ధితేంటో అర్ధం చేసుకోవ‌చ్చు. 


కొండ‌వీటి వాగు పొంగితే...


ఆదివారం కురిసిన వ‌ర్షాల‌కు   కొండ‌వీటి వాగులో నుండి 2 టిఎంసిల వ‌ర‌ద నీరు వ‌చ్చే అవకాశం ఉంది. అదే గ‌నుక జ‌రిగితే వాగు చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అవ్వ‌టం ఖాయం.  ఆ మ‌ధ్య ప‌డిన మామూలు వ‌ర్షాల‌కే  అమ‌రావ‌తి చుట్టు ప‌క్క‌ల గ్రామాల‌కు నాలుగు రోజుల పాటు రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. అదే సంద‌ర్భంలో అమ‌రావ‌తిలోని తాత్కాలిక స‌చివాల‌యం, అసెంబ్లీ ఎంత‌లా కురిసిందో అంద‌రికీ తెలిసిందే. అమ‌రావ‌తిలోని తాత్కాలిక  నిర్మాణాలు కొద్ది రోజుల పాటు జ‌ల‌దిగ్భందంలో చిక్కుకు పోయిన విష‌యం అంద‌రికీ అనుభ‌వ‌మే.


ప్ర‌మాద‌పు అంచుల్లో రాజ‌ధాని గ్రామాలు


ఇపుడు కురుస్తున్న వ‌ర్షాలకు తోడు కొండ‌వీటి వీగు కూడా పొంగితే అంతే సంగ‌తులు. వాగు పొంగితే నీరుకొండ‌, పెద‌ప‌రిమి, శాఖ‌మూరు, ఐన‌వోలు త‌దిత‌ర గ్రామాలు ప్ర‌మాదంలో ప‌డ‌టం ఖాయం. ఈ ప్ర‌మాదం  ఉంద‌న్న కార‌ణంతోనే నిపుణులు రాజ‌ధానిని ఇక్క‌డ నిర్మించ‌వ‌ద్ద‌ని మొత్తుకున్నారు. గ్రీన్ ట్రైబ్యున‌ల్ లో కూడా కేసులు ప‌డ్డాయి. అయినా ప్ర‌భుత్వం ఏదో ఒక విధంగా మ్యానేజ్ చేసేసి ఇక్క‌డే రాజ‌ధానిని ఖాయం చేసింది. వ‌ర్షాలు కురిసిన ప్ర‌తీసారి రాజ‌ధాని ప్రాంతానికి ఈ ప్ర‌మాదం తప్ప‌దు.  చంద్ర‌బాబునాయుడు అనాలోచిత చ‌ర్య‌ల వ‌ల్ల ఇపుడందరూ అవస్తలు ప‌డుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: