నాలుగు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు అమరావ‌తి స‌చివాల‌యంలోని కొన్ని గ‌దుల్లో లీకేజీ మొద‌లైంది.  అద్భుత‌మైన నిర్మాణాలంటూ పాల‌కులు పొగుడుకుంటున్న భ‌వ‌నాలు  కొద్దిపాటి వ‌ర్షాల‌కే కురుస్తుండటం గ‌మ‌నార్హం. తాజా వ‌ర్షాల‌కు మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌ర్రావు,  అమ‌ర‌నాధ్ రెడ్డి, గంటా శ్రీ‌నివాస‌రావు చాంబ‌ర్ల‌లో వ‌ర్షం నీరు లీక‌వుతోంది. దాంతో మంత్రుల చాంబ‌ర్లంతా వ‌ర్ష‌పు నీటితో నిండిపోతోంది.


మంత్రుల చాంబ‌ర్ల‌లోకి నీళ్ళు 


విచిత్ర‌మేమిటంటే లీకేజీల‌ను ఒక‌వైపు అరిక‌డుతుంటే ఇంకోవైపు నుండి నీళ్ళు   కారుతున్నాయి. వ‌ర్షం దెబ్బ‌కు సీలింగ్ పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి. స‌చివాల‌యంలోని  4, 5 బ్లాకుల్లోని చాలా గ‌దుల్లో సీలింగ్ పెచ్చులు ఊడిప‌డిపోతున్నాయి. దాంతో ఎక్క‌డ ప‌ని చేస్తే ఏమి ప్ర‌మాదం ముంచుకు వ‌స్తుందో అర్ధంకాక ఉద్యోగులు ఆందోళ‌న‌ప‌డుతున్నారు.  కొంద‌రు మంత్రులు, ఉన్న‌తాధికారుల ఏసి డ‌క్ట్ ల్లోకి  కూడా నీళ్ళు చేరుతున్నాయి. దాంతో వ‌ర్షం నీళ్ళ లీకేజి దెబ్బ‌కు ఎక్క‌డ క‌రెంటు షార్ట్ సర్క్యూట్ అవుతుందోన‌ని ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది.


నాసిర‌కం క‌ట్ట‌డాలే కార‌ణ‌మా ? 


ఆ మ‌ధ్య కూడా వ‌ర్షం దెబ్బ‌కు ప‌లువురు మంత్రుల చాంబ‌ర్లు కురిసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాంబ‌ర్ కూడా వ‌ర్షం లీకేజి దెబ్బ‌కు నీళ్ళ‌మ‌య‌మైన విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ప్ర‌తిప‌క్ష నేత చాంబ‌ర్లోకి నీళ్ళు రావ‌టంపై అప్ప‌ట్లో ప్ర‌భుత్వం ఒక విచార‌ణ క‌మిటినీ కూడా నియ‌మించింది. కాక‌పోతే పై అంత‌స్తులో ఎవ‌రో పైపును కోసేయ‌టం వ‌ల్ల లీకేజీ జ‌రిగిందే కానీ నిర్మాణంలో లోపం వ‌ల్ల కాద‌ని అంద‌రినీ న‌మ్మించేందుకు ప్ర‌భుత్వం నానా అవ‌స్త‌లు ప‌డింది. జ‌గ‌న్ చాంబ‌ర్లో నీళ్ళ లీకేజి అంటే ఎవ‌రో పైపు కోసేశారు కాబ‌ట్టి లీకైంద‌న్నారు. మ‌రి మంత్రుల చాంబ‌ర్ల‌లో కూడా నీళ్ళు ఎందుకు లీక‌వుతున్నాయ‌న్న ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వం నుండి స‌మాధానం లేదు.   నాసిర‌కం నిర్మాణాలకు వంద‌ల కోట్ల రూపాయ‌లు చెల్లించిన విష‌యం బ‌య‌ట ప‌డ‌కుండా ప్ర‌భుత్వం అవ‌స్త‌లు ప‌డుతోంద‌న్న విష‌యం అర్ధ‌మైపోతోంది.  అందుకే వ‌ర్షం ప‌డ‌గానే స‌చివాల‌యంలో లీకేజీలు మొద‌ల‌వుతున్నాయి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: