లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌దైన మార్క్ రాజ‌కీయానికి ప‌దును పెడుతున్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను దెబ్బ‌తీసేందుకు వ్యూహం ర‌చిస్తున్నారు.  గ‌త‌ ఎన్నిక‌లకు ముందు, త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌-1తో కాంగ్రెస్‌, వైసీపీని క‌కావిక‌లం చేసిన సీఎం చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌-2కు చేప‌ట్టేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతుట్లు తెలుస్తోంది. ఏయే జిల్లాల్లో, ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రెవ‌రిని చేర్పించుకోవాల‌నే విష‌యంలో ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు సంప్ర‌దింపులు జ‌రిపేందుకు చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. టీడీపీలోకి చేర్చుకునే వారిలో ఎక్కువ‌గా కాంగ్రెస్ నేత‌లే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా ఉత్త‌రాంధ్ర నుంచే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.


గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇప్పుడు ప్ర‌భుత్వంపై ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో దిగి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోకి 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామ‌ని చెబుతున్నారు. అయితే.. సొంత సామాజిక‌వ‌ర్గం ఉన్న ఉత్త‌రాంధ్ర‌లోనే ఎక్కువ‌గా ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. దీంతో టీడీపీ కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేప‌థ్యంలోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌-2తో ప‌ట్టు నిలుపుకోవాల‌ని చంద్ర‌బాబు స్కెచ్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఇత‌ర పార్టీల్లోని సీనియ‌ర్ల‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. ఈ జాబితాలో శ్రీకాకుళం జిల్లానుంచి కొండ్రుముర‌ళి, విశాఖ‌ నుంచి స‌బ్బం హ‌రి, కొణ‌తాల రామకృష్ణ ఉన్న‌ట్లు స‌మాచారం. స‌బ్బం హ‌రికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే సీటు, కొణ‌తాలకు అన‌కాప‌ల్లి పార్లమెంట్ సీటు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.


తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ను కూడా పార్టీలో చేర్చుకుని, రాజ‌మండ్రి ఎంపీ, లేదా  ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు బాబు సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చంద్రబాబుతో భేటీ అయ్యార‌నే టాక్ వినిపిస్తోంది.  ఇక క‌డ‌ప జిల్లాలో మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకోవాల‌ని బాబు అనుకుంటున్నార‌ట‌. ఆయ‌న కూడా ఇందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  అలాగే మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని తీసుకునేందుకు బాబు సానుకూలంగా ఉండ‌గా.. డిప్యూటీ సీఎం కేఈ క‌`ష్ణ‌మూర్తి వ్యతిరేకిస్తున్న‌ట్లు సమాచారం. అనంత జిల్లా నుంచి మాజీ మంత్రి శైలజా నాథ్ పేరు వినిపిస్తోంది. శైల‌జానాథ్‌కు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే సీటు కేటాయించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.

Image result for chandrababu naidu

అయితే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో సీఎం చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న తీరుపై అటు ప్ర‌జ‌ల్లో, ఇటు పార్టీ క్యాడ‌ర్‌లో కొంత అసంత‌`ప్తి ఉంది. హోదా విష‌యంలో ఆయ‌న కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో తాము అధికారంలోకి వ‌స్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీలోనూ తీర్మానం చేసింది. ఇటీవ‌ల మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందుకు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిన నేత‌లంద‌రూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ర‌ఘువీరారెడ్డి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బాబుగారు చేప‌ట్టిన అప‌రేష‌న్ ఆక‌ర్ష్‌-2 ఫ‌లిస్తుందో.. విక‌టిస్తుందో చూడాలి మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: