మొత్తానికి పోలవరం కలవరమే ఆంధ్ర ప్రజలకు మిగిలించేలా ఉంది. ఫలనా గడువులోగా పూర్తి చేస్తామంటూ ఇప్పటికి అనేక డెడ్ లైన్లు పెట్టుకుంటూ వెళ్ళిన టీడీపీ సర్కార్ ఇక దాగుడు మూతలకు స్వస్తి పలికింది. పోలవరం వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయలేమంటూ చేతులెత్తేసింది. కేంద్రం సహకరిస్తేనే పూర్తి చేయగలమంటూ తప్పంతా అటు వైపుగా తోసే ప్రయత్నం చేసింది. 


హడావుడి తోనే అంతా :


నిజానికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సింది కేంద్రమే. ఆ సంగతి తెలిసి కూడా చంద్రబాబు తామే పూర్తి చెస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. జాతీయ ప్రాజెక్ట్ ని తన చేతిలోకి తీసుకుని ఆ క్రెడిట్ కొట్టేయాలని తెగ హడావుడి చేశారు. పొత్తు బాగున్నపుడు అంతా బాగానే సాగింది. చిత్తు కాగానే కేంద్రం పక్కకు  పోయింది. . కొర్రీలు వేస్తూ ముప్ప తిప్పలు పెడుతోంది. దీంతో పోలవరం తో ఓట్ల పంట పండించుకుందామనుకున్న టీడీపీకి చుక్కెదురైంది.


అవన్నీ ఉత్త మాటలేనా :


పోలవరం కేంద్రం పూర్తి చెయకపోయినా మేమే చేస్తామంటూ గత మూడేళ్ళుగా మంత్రి దేవినేని ఉమ, ప్రభుత్వం చెప్తూ వస్తున్న మాటలు ఉత్తవే అన్నది ఇపుడు తేలిపోయింది. అంతే కాదు. 2016 నుంచి 2019 వరకు పెడుతూ వచ్చిన డెడ్ లైన్లూ కూడా ఆర్భాటపు ప్రకటనలేనని కూడా అర్ధమైపోయింది. కేంద్రం నిధులు ఇస్తే పూర్తి చేస్తామని నాలుగేళ్ళలో పెద్దగా  చెప్పని బాబు సర్కార్ ఎన్నికలు దగ్గర పడుతూండగా మా వల్ల కాదు అనడం రాజకీయ ఎత్తుగడ తప్ప మరోటి కాదని సెటైర్లు పడుతున్నాయి.


అన్ని పొరపాట్లే :


నిజానికి పోలవరం పూర్తి చెయాలన్న ఆశ, ధ్యాసా టీడీపీకి లేవని ప్రతిపక్షాలు అంటున్న మాటలు సత్యమేననిపిస్తున్నాయి. 2014 జూన్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2016 వరకు పోలవరం గురించి ఆలోచన చేయలేదని కౌంటర్లు  పడుతున్నాయి. అలా రెండేళ్ళు వేస్ట్ చేసి ఆ మీదట జాతీయ ప్రాజెక్ట్ ని చేతులలోకి తీసుకోవడం కూడా మరో తప్పు అని అంటున్నారు.

ఇక కేంద్రం నుంచి గట్టిగా డిమాండ్ చేసి నిధులు తెచ్చుకోలేకపోవడం, రాజకీయ కారణాలతో పొత్తు పెటాకులు చేసుకోవడం వంటి వాటి వల్ల పోలవరం కలగానే మారిందని అంటున్నారు. మరి, ఇప్పటికైతే పోలవరం విషయంలో బాబు సర్కార్ తెర దించేసినట్లేనని చెబుతున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: