సొంత పార్టీ పెట్టుకుని నాలుగేళ్లు గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కు కేడ‌ర్‌ను కూడా పూర్తిగా ఏర్పాటు చేయ‌ని పార్టీ జ‌న‌సేన‌. అంతేకాదు, ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త నాలుగేళ్ల‌లో రాష్ట్రంలో రెండు ప్ర‌ధాన ఎన్నిక‌లు జ‌రిగాయి. నంద్యాల ఉప ఎన్నిక స‌హా కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు హోరా హోరీగా సాగాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో ఎక్క‌డా పోటీ చేయ‌ని పార్టీ కూడా జ‌న‌సేనే! అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని ప‌రుగులెత్తించాల‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త మూడు మాసాలుగా ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. పోరు యాత్ర పేరుతో ఆయ‌న ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించి.. ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రిలో కొంత మేర‌కు ప‌ర్య‌టించారు. వివిధ కార‌ణాలతో ఈ యాత్ర‌కు బ్రేకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే త‌న విజ‌న్ డాక్యుమెంటును సైతం ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే, పార్టీలో నిన్న మొన్న‌టి వ‌రకు స్త‌బ్దుగా ఉన్న ప‌రిస్తితి ఇప్పుడు మ‌బ్బులు వీడిపోతు న్న‌ట్టు వీడిపోతున్నాయి. 


నిన్న మొన్న‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు పవ‌న్ చెంత‌కు చేరుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఓ ప్ర‌తికాధినేత ఇటీవ‌ల జ‌న‌సేనలో చేరారు. అప్ప‌టి వ‌ర‌కు లేని హ‌డావుడి అక‌స్మాత్తుగా ఇప్పుడు పార్టీలో పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌త్రికాధినేత మీడియాలో ప‌లు క‌ధ‌నాలు వ‌స్తున్నాయి. కీల‌క నాయ‌కులు చాలా మంది జ‌న‌సేన బాట ప‌డుతున్నార‌ని, వారిలో రాజ‌కీయంగా దుమ్మురేపే నాయ‌కులు కూడా ఉన్నార‌ని వార్త‌లు రావ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఇలా జ‌న‌సేన‌లోకి క్యూ క‌డుతున్న వారిలో.. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు  టాప్ ప్లేసులో ఉన్న‌ట్టు తెలుస్తోంది.  గడచిన ఎన్నికల సమయాన్ని మినహాయిస్తే... టీడీపీకి ఆమంచి బలమైన నేతగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆమంచికే చీరాల టికెట్ ఇచ్చేప్ర‌తిపాద‌న ఉంది. 


 ఆమంచి విజయం సాధించేస్తారని కూడా ఆ పార్టీ వర్గాలు గట్టి ధీమాగానే ఉన్నాయి. అయితే, ఇంటర్న‌ల్ పాలిటిక్స్‌తో ఆమంచి ఇబ్బంది ప‌డుతున్నార‌ని, అందుకే ఆయ‌న టీడీపీకి న‌మ‌స్కారం పెడుతున్నార‌ని అంటున్నారు.  ఇక ఈ జాబితాలో ఆమంచితో పాటు  ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు(గిద్దలూరు) - మాదిశెట్టి వేణుగోపాల్(దర్శి) - ఉగ్ర నరసింహారెడ్డి (కనిగిరి) - కాశీనాథ్ (మార్కాపురం)లతో పాటు కనకారావు - షేక్ రియాజ్ లు ఉన్న‌ట్టు స‌ద‌రు మీడియా వెల్ల‌డించింది. వాస్త‌వానికి వీరిలో అన్నా రాంబాబు వైసీపీలోకి వెళ్లి టికెట్ సంపాయించు కునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. 


అదేవిధంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబే... ఉగ్ర న‌ర‌సింహారెడ్డిని పార్టీలోకి తీసుకుని క‌నిగిరి నుంచి టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ ఎమ్మెల్యే క‌దిరి బాబూరావుపై వ్య‌తిరేక రిజ‌ల్ట్ రావ‌డంతో బాబు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని క‌థ‌నం వెల్ల‌డించింది. అయితే, టీడీపీ క‌న్నా కూడా త‌న‌కు జ‌న‌సేన అయితేనే బాగుంటుంద‌ని భావించిన ఉగ్ర న‌ర‌సింహారెడ్డి ఇప్పుడు ప‌వ‌న్ చెంత‌కు చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ని అంటున్నారు. మ‌రి వీటిలో ఏది నిజ‌మ‌వుతుందో చూడాలి. ఏదేమైనా ఎన్నిక‌ల వేళ జ‌న‌సేన‌కు అనుకూల మీడియాలో ఇలాంటి క‌థ‌నాలు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: