నవ్యాంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం జ్ఞానభేరి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 5న తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తొలి సదస్సు నిర్వహించగా.. రెండవది గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు చేశారు.  ఈ సదస్సు ఏర్పాట్లపై మంత్రి గంటా అధికారులతో సమీక్షించారు. నిరంతర విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం.. సాంకేతిక అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, స్టార్ట్‌పలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం ‘జ్ఞానభేరి’ లక్ష్యంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. 

నేడు విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించనున్న జ్ఞానభేరి సదస్సులో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..విద్యార్థుల ప్రతిభకు పెద్ద పీట వేయడంతోపాటు వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకునేందుకే జ్ఞానభేరి ప్రారంభించామన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను పెంచడంతో పాటూ.. వారు ప్రపంచస్థాయి ప్రమాణాలతో భవిష్యత్‌లో చదువులు, ఉద్యోగాల్లో రాణించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

రాష్ట్రంలో టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం. యువత కూడా వినూత్న ఆలోచనలతో.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నామన్నారు చంద్రబాబు. విభజన చట్టంలోని 18 అంశాలు కేంద్రం అమలు చేయాల్సి ఉందని.. ప్రత్యేక హోదా కూడా రాష్ట్రానికి ఇవ్వాలన్నారు.   ఈ సదస్సులో జిల్లాలో 13 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. జ్ఞానభేరి సదస్సుకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: