టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ద‌లిక‌లు తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్నాయి. ఆయ‌న హ‌డావుడితో ముంద‌స్తు ర‌ణంపై మ‌రింత ఉత్కంఠ నెల‌కొంటోంది. శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న పార్టీ రాష్ట్ర క‌మిటీ, పార్ల‌మెంటు, శాస‌న‌స‌భా ప‌క్ష సంయుక్త స‌మావేశంతో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ స‌మావేశం ముగిసిన వెంట‌నే ఆయ‌న ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే కేవ‌లం ఇర‌వై రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌ళ్లీ ఢిల్లీకి కేసీఆర్ ప‌యనం అవుతున్నారు. అక్క‌డ ప్ర‌ధాని మోడీ, ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో ఆయ‌న భేటీ కానున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు సీఎం కేసీఆర్ మదిలో ఏముందో అర్థం కాక‌ అటు పార్టీ వ‌ర్గాలు, ఇటు ప్ర‌తిప‌క్షాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ప్ర‌ధాని మోడీతో వ‌రుస భేటీలు కావ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

Image result for telangana

అస‌లు సీఎం కేసీఆర్ ఏం చేయ‌బోతున్నారు..?  నిజంగానే ముంద‌స్తు వెళ్లే ధైర్యం చేస్తారా..? వ‌చ్చే డిసెంబ‌ర్‌లో రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మిజోరం, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల‌తోపాటు తెలంగాణ‌లో జ‌రిగే అవ‌కాశాలు ఎంత‌మేర‌కు ఉన్నాయి..?  లేక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌తోపాటు ఇత‌ర ప‌క్షాల‌ను త‌న వ్యూహంలో ప‌డేయ‌డానికే కేసీఆర్ ఈ హ‌డావుడి చేస్తున్నారా..? ఇలా  ఎన్నో.. ఎన్నెన్నోప్ర‌శ్న‌లు అంద‌రి మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌ధాని మోడీతో కేసీఆర్ వ‌రుస భేటీలు కావ‌డంపై కూడా అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కేంద్రం వ‌ద్ద పెండింగ్ లో ఉన్నాయ‌ని, వాటిని సాధించుకునేందుకు స్వ‌యంగా ముఖ్య‌మంత్రి కేసీఆరే రంగంలోకి దిగుతున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు పైకి చెబుతున్నా.. నిజానికి రాజ‌కీయ ఎజెండా ప్ర‌ధాన‌మ‌నే టాక్ వినిపిస్తోంది. 

Image result for kcr modi

సుమారు ఇర‌వై రోజుల క్రితం కూడా సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ కొద్దిరోజుల వ్య‌వ‌ధిలోనే భేటీ అవుతుండ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక ముఖ్య‌మంత్రికి ప్ర‌ధాని ఇలా వ‌రుస అపాయింట్‌మెంట్లు ఇవ్వ‌డాన్ని రాజ‌కీయ వ‌ర్గాల‌తోపాటు విశ్లేష‌కులు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేసి, దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు తెస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌మావేశంలో మోడీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆయ‌న చుట్టూ తిర‌గ‌డం.. ఇదే స‌మ‌యంలో అడిగిన వెంట‌నే మోడీ కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. కేసీఆర్‌లో ఇంత‌లోనే ఎంత మార్పు వ‌చ్చిందంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. 


మొద‌ట్లో.. ఫ్రంట్ ఏర్పాటు కోసమంటూ.. ఒక‌టే హ‌డావుడి చేశారు కేసీఆర్‌. ప‌శ్చిమ‌బెంగాల్ వెళ్లి తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్య‌మంత్రి మ‌మ‌త‌ను, ఇటు క‌ర్ణాట‌క‌కు వెళ్లి మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ‌ను, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామిని, త‌మిళ‌నాడుకు వెళ్లి డీఎంకే నేత‌లు క‌రుణానిధి, స్టాలిన్‌, క‌నిమొళితో కేసీఆర్ భేటీ అయ్యారు. కానీ..కాంగ్రెస్ పార్టీలేని బీజేపీ వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటు అసాధ్య‌మ‌ని మ‌మ‌త చెప్ప‌డం.. ఎన్సీపీ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ త‌దిత‌ర పార్టీలు కూడా అందుకు ఓకే చెప్ప‌డం.. ఇప్పుడు ఆ దిశ‌గా చ‌క‌చ‌కా అడుగులు కూడా ప‌డుతున్నాయి. దీంతో కంగుతున్ని కేసీఆర్.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ మోడీ చుట్టూ తిరుగుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల‌ను అయోమ‌యానికి గురిచేయ‌డం.. అదే స‌మ‌యంలో కేంద్రం వ‌ద్ద పెండింగ్ ప‌నుల కోసం తాను బాగా క‌ష్ట‌ప‌డుతున్నాన‌నే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లో క‌లిగిండం కోసమే కేసీఆర్ ఇలా చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: