అవును! మ‌రో కొన్ని నెల‌ల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. రాష్ట్రంలో రాజ‌కీయం కూడా వేడెక్కింది. ఇక‌, పార్టీలు వేటిక‌వే .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఈ నేప‌థ్యంలో గెలుపు గుర్రాల‌నే ఎంపిక చేసుకోవాల‌ని ప్ర‌ధాన పోటీ దారులుగా ఉన్న టీడీపీ-వైసీపీలు నిర్ణ‌యించుకున్నాయి. ఈ క్ర‌మంలో మొహ‌మాటాల‌కు, సిఫార‌సుల‌కు కూడా తావు లేకుండా ఈ రెండు పార్టీల అధినేత‌లు వ్యూహాలకు ప‌దును పెడుతున్నారు. వైసీపీ ప‌రిస్థితి ఒకింత ప‌క్క‌న పెడితే.. టీడీపీలో ఒక టికెట్ కోసం ఇద్ద‌రు నుంచి న‌లుగురు వ‌ర‌కు పోటీ వ‌స్తున్న వారి సంఖ్య భారీ సంఖ్య‌లో పెరుగు తోంది. కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో సిట్టింగుల‌తో పాటు వైసీపీ నుంచి వ‌చ్చిన వారు కూడా పోటీకి రెడీ అవుతున్నారు. 


అయితే,  పైన చెప్పుకొన్నట్టు.. గెలుపు గుర్రాల‌కు మాత్రమే టికెట్లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 మంది వ‌ర‌కు నేత‌లకు టికెట్లు ల‌భించే అవ‌కాశం మృగ్య‌మేన‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. వీరంతా ఆర్థికంగా చాలా బ‌లంగానే ఉన్న‌ప్ప‌టికీ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం ఒకింత వెనుక‌బ‌డి ఉన్నారు. దీంతో వీరికి అవ‌కాశం ఇస్తే.. ఆ టికెట్ ను కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌ధాన పార్టీ అయిన‌ టీడీపీ భావిస్తోంది. అయితే, ఆయా నేత‌లు మాత్రం.. త‌మ‌కు మంచి ప‌ట్టుంద‌ని, త‌మ‌కు టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. అంతేకాదు, ఒక‌వేళ టికెట్ ఇవ్వ‌క‌పోతే.. త‌మ దారి తాము చూసుకుంటామ‌ని కూడా వారు హెచ్చ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో ఆశ్చ‌ర్య‌క‌ర/ఉత‌్కంఠ‌ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 


ఎన్నిక‌ల స‌మ‌యానికి ఇలాంటినాయ‌కుల‌కు టికెట్ రాక‌పోతే గ‌తంలో అయితే రెబ‌ల్ అభ్య‌ర్థులుగా రంగంలోకి దిగేవారు. అయితే, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ స్థాపించిన జ‌న‌సేన పార్టీయేన‌ని చెబుతున్నారు. అధికార పార్టీ లో టికెట్లు ల‌భించ‌వ‌ని భావిస్తున్న దాదాపు 20 నుంచి 40 మంది నాయ‌కులు ఇప్పుడు జ‌న‌సేన‌కు టచ్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. వీరంతా కూడా త‌మ‌కు టికెట్ ఇస్తే చాల‌ని అంతా తామే చూసుకుంటామ‌ని కూడా భ‌రోసా ఇస్తున్నారు. అయితే, ప‌వ‌న్ కూడా వీరిని అన్నీ నిశితంగా ప‌రిశీలించిన త‌ర్వాతే.. పార్టీలోకి ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తాజాగా తెలిసింది. వీరిలో కేవ‌లం 20 మందికి ఛాన్స్ ల‌భించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. టీడీపీలో టికెట్ ల‌భించ‌ని నాయ‌కులు ఇప్పుడు జ‌న‌సేన వైపు చూస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: