వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశమవుతోంది. 6 నుంచి పది రోజుల పాటు ఈ రైనీ సెషన్ జరుగుతుంది. సెలవులు పోనూ మొత్తంగా ఆ నెల 20వ తేదీ వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఆరు నెలల తరువాత జరిగే ఈ సమావేశాలు కీలకమైనవే. ఎందుచేతనంటే కేంద్రంతో కటీఫ్ తరువాత జరిగేవి కాబట్టి సభను టీడీపీ బాగానే వాడుకుంటుంది. కేంద్రాన్ని ఎండగట్టే వ్యూహానికీ పదును పెడుతుంది.


విమర్శల వర్షం



టీడీపీ అడ్డుకట్ట వేసేందుకైనా  ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఈ సమావేశాలకు హాజరవ్వాలని ఆ పార్టీలోనూ భావిస్తున్నారు. ఇక ఇంటా బయటా ఈ విషయంపై వైసీపీ ఘాటు విమర్శలు ఎదుర్కొంటోంది. జనసేనని పవన్ నుంచి,  కొత్తగా పార్టీ పెట్టిన ఎంపీ గీత సైతం వైసీపీని ఇదే అంశంపై నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికార టీడీపీకి ఇదొక అస్త్రంగా మారిపోయింది కూడా.


వైసీపీ వెళ్ళాల్సిందే :



ప్రజా సమస్యలు చర్చించేందుకు, ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేందుకు వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాల్సిందేనని లోక్ సత్తా ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ఈ రోజు విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, కాగ్ నివేదిక టీడీపీ అవినీతిని బయటపెట్టిందని, దాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. విష జ్వరాలతో పాటు, అనేక ఇతర ప్రజా  సమస్యలను లేవనెత్తాలని వైసీపీకి సూచించారు. ప్రభుత్వం చేత జవాబు చెప్పించాల్సిన బాధ్యత వైసీపీ పైనే ఉందన్నారు.


జగన్ వింటారా :


మరి ఇంటా బయటా కూడా చలో అసెంబ్లీ అన్న నినాదమే వినిపిస్తోంది. పార్లమెంట్ కి వైసీపీ ఎంపీలు రాజీనామా  చేసేశారు. ఇక అసెంబ్లీకి వెళ్ళకుండా ఏడాది గడిపేశారు. చట్ట సభలకు పార్టీని గెలిపించాలంటూ మరో వైపు కోరుతూ  అవే చట్ట‌సభల పట్ల అనుసరిస్తున్న వైఖరి వైసీపీకి బూమరాంగ్ అవుతుందన్న ఆందోళన ఆ పార్టీలోనూ ఉంది.  ప్రస్తుతం విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న ఆ పార్టీ అధినేత జగన్ ఏమంటారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: