తెలంగాణ‌లో బీజేపీకి కంచుకోట‌లా ఉన్న అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఇక్క‌డి నుంచి మూడుసార్లు గెలిచిన కిష‌న్ రెడ్డి.. గులాబీ ద‌ళ‌ప‌తి వ్యూహాల‌ను ఎలా ఎదుర్కొంటార‌నే ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే అంశాన్ని ముందే ఊహించి.. నేత‌లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇందులో కిష‌న్ రెడ్డి కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. రాష్ట్రానికే ప‌రిమితం కాకుండా ఈసారి ఢిల్లీ స్థాయికి వెళ్లాలని నిర్ణ‌యించుకుని వ్యూహాలు ర‌చించేస్తున్నారు. మ‌రోప‌క్క సీఎం కేసీఆర్.. కూడా ఈసారి ఎలాగైనా ఈ కాషాయ కోటను బ‌ద్ద‌లు కొట్టాల‌నే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కిష‌న్ రెడ్డి అడుగులు ఎటువైపు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఢిల్లీ పెద్ద‌ల నిర్ణ‌యంతో తెలంగాణ‌కే ప‌రిమిత‌మ‌వుతారా లేక వారి ఆశీర్వాదంతో ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్పుతారా అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 


పూర్వ హిమాయత్‌నగర్‌ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ విజయాలతో బీజేపీ పటిష్ఠంగా ఉంది. దీనిని రద్దు చేసి 2009లో కొత్తగా అంబర్‌పేట నియోజకవర్గం ఆవిర్భావించింది. టీఆర్‌ఎస్ ఆవిర్భ‌వించిన తర్వాత తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పోటీ చేసింది. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోవింద్‌గిరి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 2009లో అంబర్‌పేట నియోజకవర్గం ఆవిర్భావించిన తర్వాత రెండోసారి టీఆర్‌ఎస్‌ పోటీ చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా జగదీశ్వర్‌ ఎన్నికల బరిలో నిలిచి జి.కిషన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో మూడోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ పోటీ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి నిలబడి గట్టి పోటీనిచ్చారు. మ‌ళ్లీ  కిషన్‌రెడ్డి గెలిచారు. 
 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఇక్క‌డ తిరుగులేని మెజార్టీ అందించారు. దీంతో కిషన్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బతలిగింది. ఈ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ అదే ఊపుతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసి ఎలాగైనా విజయం సాధించాలనే యోచనలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఉన్నారు. మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్ త‌దిత‌రులు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు.


అయితే ఈసారి కిష‌న్ రెడ్డి ఎంపీగా పోటీచేస్తార‌నే ప్ర‌చారం కూడా జోరుగా జ‌రుగుతోంది. ఢిల్లీ పెద్ద‌ల ఆశీర్వాదాలు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఢిల్లీకి వెళ్లాల‌నే యోచ‌న‌లో ఉన్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావొచ్చ‌ని నేత‌లు భావిస్తున్నారు. దీంతో ఎంపీగా విజ‌యం సాధించి కేంద్ర మంత్రిగా ఛాన్స్ కొట్టేయాలని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. ఒక‌వేళ కిష‌న్ రెడ్డి ఎంపీగా పోటీచేస్తే త‌మ‌కు క‌ల‌సి వ‌స్తుంద‌ని గులాబీ నేత‌లు అంచ‌నాలు వేస్తున్నారు. బీసీలు అత్యధికంగా ఉండడం, మైనారిటీ ఓట్లు కూడా కలిసి వస్తాయని ఆశ‌లు పెట్టుకున్నారు. బలమైన అభ్యర్థిని బరిలో నిలిపి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. మ‌రి కిష‌న్ రెడ్డి ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుంద‌నేది ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: