వైసీపీలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. పార్టీ అధినేత జ‌గ‌న్‌..వ్యూహాత్మ‌కంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ముందుకు ఉరుకుతుంటే.. ఉన్న‌తస్థానాల్లో ఉన్న‌వారు మాత్రం త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నాయ‌కులు నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డం కోసం జ‌గ‌న్ చేస్తున్న క‌ష్టం కూడా వీరి మాట‌లు, వ్యాఖ్య‌ల కార‌ణంగా మంట‌గ‌లిసిపోతోంద‌నే అభిప్రా యం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న జ‌గ‌న్ దూకుడు నిజంగానే అప్ర‌తిహ‌తం.


వెయ్యి గొడ్ల‌ను తిన్న రాబందు కూడా పెద్ద గాలివాన‌కు చ‌చ్చిన‌ట్టుగా... ఎంతో మంది రాజ‌కీయ నేత‌ల‌ను, రాజకీయాల ను చ‌వి చూసిన చంద్ర‌బాబు సైతం జ‌గ‌న్ అంటే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నిజానికి వ‌చ్చే చంద్ర‌బాబు వంటి రాజ‌కీయ ధీరుడు.. కూడా జ‌గ‌న్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా ఢీకొట్టాలో తెలియ‌క నానా తిప్ప‌లు ప‌డుతున్నాడు. అలాంటి పార్టీని మ‌రింత‌గా అభివృద్ధి చేయాల్సిన పార్టీ నేత‌లు ఇప్పుడు వైసీపీకి కొర‌గాని నాయ‌కులుగా మారిపోయారు. 


ముఖ్యంగా అధికార ప్ర‌తినిధిగా, కార్య‌ద‌ర్శిగా ఉన్న విజ‌య‌సాయి రెడ్డి, జ‌గ‌న్ సొంత బాబాయి ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తిరుప‌తి మాజీ ఎంపీ, జ‌గ‌న్‌కు స్నేహితుడు వ‌ర‌ప్ర‌సాద్ వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతాన‌ని జ‌గ‌న్ ఒక‌ప‌క్క చెబుతున్నారు. ప్ర‌జ‌ల‌లోకి ఈ నినాదంతోనే ముందుకు వెళ్తున్నారు. అయితే, వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం త‌మ‌కు ప‌వ‌న్ అండ కావాల‌ని, ఆయ‌న అండ‌తో ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తామ‌ని అప్ర‌స్తుత ప్ర‌సంగం చేస్తూ.. పార్టీని గంద‌ర‌గోళంలోకి నెడుతున్నారు. 


ఇక‌, విజ‌య‌సాయి.. పార్టీ వ్య‌వ‌హారాల‌ను సైతం గోప్యంగా ఉంచ‌కుండా పోసుకోలు ప్ర‌క‌ట‌న‌ల‌తో పార్టీ ప్ర‌తిష్ట‌కే మ‌చ్చ తెస్తున్నారు. ఇక‌, వైవీ సుబ్బారెడ్డి.. గ్రూపులు క‌డుతూ.. సీనియ‌ర్ నేత‌ల‌ను సైతం ప‌క్క‌కు పెడుతూ.. ఒంటెత్తు పోక‌డ‌ల‌తో ముందుకు పోతున్న తీరు పార్టీలోని మిగిలిన వారికి సైతం ఇబ్బందిక‌రంగా మారుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్ప‌టికైనా వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్ పెరుగుతోంది. మ‌రి ఏదిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: