మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో  సీనియ‌ర్ నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి తెలుగుదేశంపార్టీకి పెద్ద బొక్కే పెట్టారు. సెప్టెంబ‌ర్ 2వ తేదీన ఆనం వైసిపిలో చేరుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.  ఆ విష‌యంగానే త‌న నివాసంలో ఆనం మ‌ద్ద‌తుదారుల‌తో  స‌మావేశమయ్యారు.  జిల్లాలోని  ప‌లు ప్రాంతాల్లోని ఆనం మ‌ద్ద‌తుదారులందరూ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.  ఆనం వెంట తాము కూడా ప్ర‌యాణం చేస్తామంటూ హామీ ఇచ్చారు. 


ఆనం వెంటే మ‌ద్ద‌తుదారులు 


ఆనం స‌మావేశానికి మ‌ద్ద‌తుదారులంద‌రూ హాజ‌ర‌వ్వ‌ట‌మే కాకుండా పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌టంతో  టిడిపి నేత‌ల‌కు పెద్ద దెబ్బే ప‌డిన‌ట్లైంది. ఎలాగంటే,  ఆనం నిర్వ‌హించిన  స‌మావేశానికి మ‌ద్ద‌తుదారులెవ‌రూ  హాజ‌రుకాకుండా  టిడిపి నేత‌లు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేశారు. కొమ్మి ల‌క్ష్మ‌య్య‌నాయుడు, గిరినాయుడు, బీద ర‌విచంద్ర‌యాద‌వ్ త‌దిత‌రులు ఆనం మ‌ద్ద‌తుదారుల్లో చాలా మందితో గ‌డ‌చిన రెండు రోజులు మంత‌నాలు జ‌రిపారు. ఆనం వైసిపిలో చేరినా మ‌ద్ద‌తుదారుల్లో ఎవ‌రూ ఆనంతో వెళ్ళ వ‌ద్దంటూ న‌చ్చ చెప్పారు. టిడిపిలోనే ఉంటే అది చేస్తామ‌ని, ఇది ఇస్తామ‌ని చాలా హామీలే ఇచ్చారు. కానీ వాళ్ళు  చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫలించ‌లేదు. 


నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు


కాంగ్రెస్ నుండి టిడిపిలోకి ఆనం మారిన‌పుడు  జిల్లా వ్యాప్తంగా ప్ర‌ధానంగా నెల్లూరు, ఆత్మ‌కూరు, వెంక‌ట‌గిరి, సూళ్ళూరుపేట నియోజ‌క‌వ‌ర్గాల్లోని మ‌ద్ద‌తుదారులు కూడా  టిడిపిలో చేరారు.  అయితే, టిడిపిలో ఉన్నంత కాలం ఆనం సోద‌రులు ఎదుర్కొన్న అవ‌మానాల‌ను అంద‌రూ గ‌మ‌నించారు. దానికితోడు ఈ మ‌ధ్య‌నే రామ‌నారాయ‌ణ‌రెడ్డి సోద‌రుడు ఆనం వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణించారు. అప్ప‌టి నుండి రామ‌నారాయ‌ణ‌రెడ్డి మ‌ద్ద‌తుదారుల్లో సానుభూతి మ‌రింత‌గా పెరిగింది. 


తేల‌ని నియోజ‌క‌వ‌ర్గం


టిడిపిలో ఎదుర‌వుతున్న అవ‌మానాల‌ను త‌ట్టుకోలేకే పార్టీ మారిపోవాల‌ని ఆనం నిర్ణ‌యించుకున్నారు. స‌రే, వైసిపిలో చేరితే ఏ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయాల‌నే విష‌యంలో  ఇంకా క‌న్ఫ్యూజ‌న్ అయితే కంటిన్యూ అవుతోంది. ఇన్ని సంవ‌త్స‌రాలుగా ప్రాతినిధ్యం వ‌హించిన ఆత్మ‌కూరులో పోటీకి అవ‌కాశం లేదు.  స్దిర నివాస‌మున్న నెల్లూరులోనూ పోటీ సాధ్యంకాదు. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేద్దామ‌నుకుంటే అక్క‌డ కూడా నేదురుమ‌ల్లి రామ‌కుమార్ రెడ్డి రూపంలో గ‌ట్టి పోటీ ఉంది. నేదురుమ‌ల్లే కాకుండా ఇద్ద‌రు వైసిపి నేత‌లు కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. 


టిడిపికి ఇబ్బందులు త‌ప్ప‌వా ?


ఒక విధంగా చెప్పాలంటే జిల్లా మొత్త మీద వైసిపి ప‌రంగా చూస్తే వెంక‌ట‌గిరే ఫుల్ డిమాండ్ ఉన్న‌ నియోజ‌క‌వ‌ర్గం అయిపోయింది.  జిల్లాలో సుమారు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో  ప్ర‌భావం చూప‌గ‌లిగిన ప‌ట్టు ఆనం కుటుంబానికుంది. ఆ విష‌యం తెలుసుకాబ‌ట్టే మ‌ద్ద‌తుదారుల నుండి విడ‌గొట్టి ఆనంను ఒంట‌రిని చేయాల‌ని టిడిపి పెద్ద ప్లానే వేసింది. అయితే, ఆ ప్లాన్లేవీ ప‌నిచేయ‌లేదు. దాంతో పై నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఆనం మ‌ద్ద‌తుదారులంద‌రూ ఆనంతో పాటు వైసిపి లో చేర‌టానికి రంగం సిద్దం చేసుకోవ‌టంతో టిడిపికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెద్ద బొక్క త‌ప్పేట్లు లేదు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: