మాజీ డీజీపీ నండూరి సాంబ‌శివ‌రావు.. ఉదంతం నాలుగు రోజులు గ‌డిచినా.. ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఒకప్పుడు సీఎం చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నండూరి విప‌క్ష నాయ‌కుడు, వైసీపీ అధినేత జగన్‌ను విశాఖ‌లోని ఓ మారుమూల ప‌ల్లెలోకి వెళ్లి స్వయంగా కలవడం సంచలనం సృష్టించింది. అంతేకాదు.. మునుపెన్న‌డూ లేని విధంగా జ‌గ‌న్‌కు పుష్ప‌గుచ్ఛం ఇచ్చి మ‌రీ ఆయ‌న‌ను అభినందించ‌డం గ‌మ‌నార్హం. దీంతో నండూరి వైసీపీలో  చేరతారని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించడం మ‌రింత సంచ‌ల‌నం సృష్టించింది.

అయితే, ఈ రెండు విష‌యాలు తీవ్ర‌స్థాయిలో రాష్ట్రాన్ని షేక్ చేశాయి. దీంతో వెంట‌నే రంగంలోకి వ‌చ్చిన నండూరి తాను పార్టీలోకి చేర‌డం లేద‌ని వ్యాఖ్యానించడం రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.  ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడు తాను స్వయంగా కలిశానని, ఇప్పుడు కూడా అదే విధంగా జ‌గ‌న్‌ను కలిశానని, దీనిలో విశేషం ఏమీ లేదని చెబుతున్నారు నండూరి. అయితే, నిజానికి ప్ర‌తిప‌క్ష నాయకుడి ప‌ట్ల అంత విధేయ‌త ఉంటే.. తాను డీజీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్పుడు కూడా క‌లిసి విష్ చేసి ఉండాలి.

కానీ, అలా జ‌ర‌గ‌లేదుగా!! మ‌రి ఇప్పుడే నండూరి ఎందుకంత రియాక్ట్ అయ్యారు? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఈ ప‌రిణామం మొత్తం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఇరుకున పెట్ట‌డమేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో డీజీపీగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే స‌మ‌యానికే తాను టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం కూడా సాగింది. అయితే, ఈ విష‌యంలో చంద్ర‌బాబు నండూరికి ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు. పైగా ఎలాంటి ప్రాధాన్యం లేని గంగ‌వ‌రం పోర్టు సీఈవోగా నియ‌మించారు.  దీంతో ఓ ర‌కంగా నండూరి ర‌గిలిపోతున్నారు. 

ఈక్ర‌మంలోనే తాను రాజ‌కీయాల్లోకి రావ‌డం త‌థ్యం.. మీలో ఎవ‌రు బెస్ట్ చాన్స్ ఇస్తే.. వారి పార్టీలోకి నేను వ‌స్తాను- అనే సంకేతాల‌ను ఇచ్చేందుకే తాజాగా ఆయ‌న జ‌గ‌న్‌తో భేటీ అయిన‌ట్టు చెబుతున్నారు. మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేసుకుంటే మంచిద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడ‌నే పేరు తెచ్చుకోవ‌డంతో ఆయ‌న స్పందిస్తార‌నే ఆశ‌తోనే నండూరి ఇలా చేసి ఉంటార‌ని టీడీపీలోని ఓవ‌ర్గం నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి చంద్ర‌బాబు స్పందిస్తారో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: