ఏపీలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. మరో ఏడెనిమిది నెలలలో ఎన్నికలు వస్తాయనగానే ఇప్పటినుంచే హడావుడి మొదలైపోయింది. గత ఎన్నికలల్లో పడని ఓట్లను, వర్గాలను చేరదీసే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు రెడీ అయిపోయాయి. టార్గెట్ ప్రత్యర్ధి అంటూ టీడీపీ, వైసీపీ డీ కొడుతున్నాయి. ఆయువు పట్టు మీదనే కొడితే గెలుపు సులువైపోతుందన్న అంచనాతో వ్యూహకర్తలు ఉన్నారు. ఎవరికి వారు ఎత్తులు, పై ఎత్తులతో దూసుకుపోతున్నారు.


బీసీలపై వల :


వైసీపీ అధినేత జగన్ బీసీల వైపు చూస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీతో పెనవేసుకుపోయిన ఆ వర్గాన్ని ఎలాగైనా మచ్చిక చేసుకోవాలని పెద్ద మంత్రాంగమే వేస్తున్నారు. అదే కనుక జరిగితే తిరుగు ఉండదన్న అంచనాలలో వైసీపీ ఉంది. గోదావరి జిల్లాలలో బీసీలను దగ్గర చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ ఉత్తరాంధ్రలో వారి జపం చేస్తున్నారు.. ఇక్కడ మూడు జిల్లాలలో బీసీలు పెద్ద ఎత్తున సంఖ్యలో ఉండడంతో వైసీపీ అన్ని అస్త్రశస్త్రాలను బయటకు తీస్తోంది. 


చేరువ అవుతారా :


బీసీలు టీడీపీని వదిలి వైసీపీ వైపు వస్తారా అన్న దానికి జగన్ పాదయాత్ర సమాధానమని  ఆ పార్టీ నేతలు అంటున్నారు. గోదావరి జిల్లాలతొ మొదలుకుని విశాఖలోనూ బీసీలు పెద్ద సంఖ్యలో జగన్ ని అనుసరిస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నవ రత్నాలు గురించి జగన్ వారికి వివరించడం ద్వారా తాను అధికారంలోకి వస్తే చేయబోయేది ఏంటన్నది సావధానంగా చెబుతున్నారు. టీడీపీ గడచిన నాలుగేళ్ళుగా చేసిన మోసాలను వివరిస్తున్నారు. కాగా కాపులను బీసీలలో చేర్చే అంశంపై టీడీపీతో విభేదిస్తున్న బీసీలకు ప్రభుత్వ పధకాలు ఏవీ అమలు కాకపోవడంతో అసంత్రుప్తి బాగా పెరిగింది.


బీసీ గర్జనతో :


పాదయాత్ర ముగిసిన తరువాత బీసీ గర్జన నిర్వహించి వైసీపీ తరఫున డిక్లరేషన్ విడుదల చేస్తారని పార్టీ వర్గాల భోగట్టా. బీసీ గర్జనతో మొత్తం ఆ వర్గం వైసీపీ వైపు మళ్ళడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు. రేపటి రోజున బీసీలకు రాజకీయంగా, ఆర్ధికంగా చేయబోయే మేళ్ళ గురించి జగన్ గర్జనలో ప్రకటిస్తారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే బీసీలు ఇపుడు వైసీపీ వైపుగా మళ్ళుతున్నారని అంటున్నారు. వారిని అక్కున చేర్చుకోవడం ద్వారా జగన్ కచ్చితమైన విశ్వాశాన్ని దక్కించుకుంటారని పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: