మాజీ మంత్రి, యాక్టివ్ నేతగా పేరున్న అనంత‌పురం జిల్లా కాంగ్రెస్ నాయ‌కుడు సాకే శైల‌జాన‌థ్‌కు ఇప్పుడు అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాల‌తో జోష్ మీదున్న ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో సైలెంట్ అయిపోయారు. అయితే, ఆయ‌న ఇప్ప‌టికీ కాంగ్రెస్లోనే ఉన్నా.. త్వ‌ర‌లోనే పార్టీ మార్పు ఖాయ‌మ‌ని వినిపిస్తోంది. శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న త‌న‌దైన ముద్ర వేశారు. ఇక్క‌డ తాగునీటి ఇబ్బందుల‌ను తొల‌గించేందుకు ప‌లు ప్రాజెక్టుల‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపారు. అయితే, ఇప్ప‌టికీ అవి సాకారం కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. 


కానీ, ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో విరివిగా ట్యాంక‌ర్ల‌తో నీటిని స‌ర‌ఫ‌రా చేసిన సాకే.. ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం సంపాయించుకున్నారు. ఇక‌, వైద్యం, విద్య వంటి విష‌యాల్లో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సంతృప్తి క‌ర సేవ‌లు అందించారు. 2004 ఎన్నిక‌ల్లో దాదాపు 8 వేల ఓట్లతో గెలుపొందిన ఆయ‌న అదే హ‌వాను 2009లోనూ కొన‌సాగించారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న భారీ స్కెచ్ వేశారు. గ‌త మూడు నెల‌ల కింద‌ట శైల‌జానాథ్ ఇక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోగ‌తాన్ని తెలుసుకున్నారు. వారు కాంగ్రెస్ గురించి ఏమ‌నుకుంటున్నారు? ప‌్ర‌స్తుత ఎమ్మెల్యే యామినీబాల గురించి ఎలా స్పందిస్తున్నారు? వ‌ంటి విష‌యాల‌ను రాబ‌ట్టారు. 


కాంగ్రెస్‌పై గ‌త 2014 నాటి అభిప్రాయం కొన‌సాగుతుండ‌గా.. ఎమ్మెల్యే యామినీబాల విష‌యంలో మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీగా ప్ర‌జ‌లు రియాక్ట్ అయ్యారు. ఆమె త‌మ‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని, ఆమె కోసం ప్ర‌య‌త్నిం చినా ఫ‌లితం ఉండ‌డం లేద‌ని కూడా ప్ర‌జ‌లు వివ‌రించారట‌. ఈ నేప‌థ్యంలో త‌న‌కు అనుకూలంగా ప‌రిస్థితిని మార్చుకునేందుకు ఆయ‌న త్వ‌ర‌లోనే నియోజ‌క‌వ‌ర్గంలో యాత్ర చేయా లని నిర్ణ‌యించుకున్నారు. అయితే, కాంగ్రెస్‌లో ఉండి చేయ‌డం క‌న్నా టీడీపీ తీర్థం పుచ్చుకుని చేయ‌డం బెట‌ర‌ని మ‌రో ఆలోచ‌న చేస్తున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా ప్ర‌స్తుత సిట్టింగ్ యామినీబాల‌పై వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు సాకే ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. 


ఇదిలావుంటే, వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిన జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావతి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత గ‌ట్టిగా రాణించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నా రు. టీడీపీకి వివాద‌స్ప‌దంగా ఉన్న ప్రాంతాల‌ను, నాయ‌కుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు య‌త్నాలు ప్రారంభించారు. గ‌త ఎన్నిక‌ల్లోనే విజ‌యం దోబూచులాడ‌గా కేవ‌లం 4 వేల ఓట్ల తేడాతోనే ఆమె విజ‌యానికి చేరువ కాలేక పోయారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా విజ‌యం సాధించి తీరాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఆమె వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇక్క‌డ సాకే కొంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే.. విజ‌యం ఆయ‌న‌కే సొంత‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: