రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. నేత‌లు మాత్రం ఎప్పుడు ఒకేలా ఉండాల‌ని, ఎప్పుడూ తామే గెల‌వాల‌ని కూడా భావిస్తారు. సాధార‌ణంగా రాష్ట్రంలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకే నేత కొన్నేళ్లుగా గెలుపు గుర్రం ఎక్కుతున్న సంచ‌ల‌న ప‌రిస్థితి ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు సీఎం చంద్ర‌బాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి వ‌రుస పెట్టి గెలుస్తూనే ఉన్నారు. ఒక్కొక్క‌సారి ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో అక్క‌డ ప్ర‌చారం కూడా చేయ‌డం లేదు. అయినా ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే. అదేవిధంగా క‌డ‌ప జిల్లా పులివెందుల వైఎస్ ఫ్యామిలీ త‌ర‌ఫున ఎవ‌రు నుంచున్నా విజ‌యం ఖాయం. గుంటూరు జిల్లా పొన్నూరు ఇక్క‌డ టీడీపీ నాయ‌కుడు ధూళిపాళ్ల‌కు తిరుగేలేదు. ఇలా చాలా మంది నాయ‌కులు ఉన్నారు. 

Image result for chandrababu

అయితే, విశాఖ జిల్లా పెందుర్తిలో మాత్రం చాలా విచిత్ర‌మైన సెంటిమెంట్ రాజ‌కీయాల‌ను శాసిస్తోంది. ఇక్క‌డ ఒక‌సారి గెలిచిన నాయ‌కుడు మ‌రోసారి టికెట్ సంపాయించ‌డం, గెల‌వ‌డం అనేది లేకుండా పోయింది. పైకి ఇది సాధార‌ణంగా కామ‌నే అని అనిపించినా.. ఇక్క‌డ పోటీ చేస్తున్న నాయ‌కుల‌కు మాత్రం చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది విష‌యంలోకి వెళ్తే... రాజకీయాల పురిటిగడ్డ పెందుర్తి నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పెందుర్తి శాసనసభ ఎన్నికలు వచ్చేసరికి ఒక్కసారే ఆదరిస్తుంది. రెండోసారి ఇంటికి పంపించేస్తుంది. పెందుర్తి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు తొమ్మిది దఫాలుగా జరిగిన ఎన్నికలలో ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన వారికి రెండో సారి పార్టీ టిక్కెట్‌ రావడమే గగనం. 


ఒకవేళ టికెట్‌ వచ్చినా పరాజయం తప్పడం లేదు. 1977లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి దఫా జరిగిన శాసనసభ ఎన్నికలలో గుడివాడ అప్పన్న కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఆయన ఆకస్మిక మరణంతో 1980లో జరిగిన ఉప ఎన్నికలలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ద్రోణం రాజు సత్యనారాయణ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదుపరి 1985లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈయనకు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించినప్పటికీ విజయం వరించలేదు. 


తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో పెతకంశెట్టి అప్పలనరసింహంచేతిలో 30వేలకు పైగా ఓట్ల తేడాతో ద్రోణం ఓటమి చెందారు. తర్వాత ద్రోణంకు పెందుర్తి నుంచి పోటీచేసే అవకాశమే లభించలేదు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్ని కలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అప్పలనరసింహంకు పెందుర్తి నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. అనూహ్యంగా ఈయన అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. 1985లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆళ్ళ రామచంద్రరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ళకి కూడా పోటీచేసే అవకాశం దక్కలేదు. అప్పటి ఎన్నికలలో గుడివాడ గురునాథరావు ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 

 

1994లో జరిగిన ఎన్నికలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుడివాడకు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఆ ఎన్నికలలో మిత్రపక్షాల తరఫున పోటీ చేసిన మానం ఆంజనేయులు గెలుపొందారు. తిరిగి 1999లో జరిగిన ఎన్నికలలో ఆంజనేయులు బరిలో దిగినప్పటికీ విజయం వరించలేదు. ఈ ఎన్నికలలో ప్రస్తుత పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు టీడీపీ తరఫున పెందుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తరువాత 2004 శాసనసభ ఎన్నికలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గణబాబుకు కూడా టిక్కెట్‌ దక్కలేదు. ఈ ఎన్నికలలో తిప్పల గురుమూర్తిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
 

తదుపరి నియోజకవర్గాల విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికలలో తిప్పల పెందుర్తి నుంచి గాజువాక నియోజకవర్గానికి బదిలీ అయిపోయారు. అప్పట్లో జరిగిన ఎన్నికలలో నూతనంగా ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పంచకర్ల రమేష్‌బాబు పోటీచేసి గెలుపొందారు. 2014 ఎన్నికలకి పంచకర్లకు స్థానచలనం తప్పలేదు. యలమంచిలి నియోజకవర్గానికి తరలిపోయారు. ఈ ఎన్నికలలో జరిగిన చతుర్ముఖ పోటీలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పెందుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఇప్పుడు ఈయ‌న కూడా ఇదే సెంటిమెంట్ తెలుసుకుని త‌ల్ల‌డిల్లిపోతున్నారు. త‌న‌కు అసలు టికెట్ వ‌స్తుందో రాదో.. వ‌చ్చినా గెలుస్తానో లేదో అని జాత‌కాలు చెప్పించుకుంటున్నారట‌. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: