వ‌చ్చే ఎన్నిక‌ల్లో వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు నేత‌లు కుతూహ‌లంగా ఉన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉండ‌గా.. ఒక్క క‌డ‌ప‌లో మాత్రం ఎక్కువ‌గానే ఈ సంఖ్య క‌నిపిస్తుండ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇటీవ‌లే మంత్రి ప‌ద‌వులుపొందిన వారు సైతం వ‌చ్చే ఎన్నిక‌ల‌లో త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. దీంతో రాజ‌కీయాలు వేడెక్కాయి. విష‌యంలోకి వెళ్తే.. విప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో రాజ‌కీయ నేత‌ల‌కు దాదాపు 25 ఏళ్లు నిండాయి. అంద‌రూ పాతికేళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారే. కొంద‌రైతే ..ఇంకా ఎక్క‌వ కాలం నుంచి పార్టీల‌లో చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి వారి వార‌సుల‌ను రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యిం చుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే.. వార‌సుల లెక్క ఇలా ఉంది.. 


ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. కొంత వయసు పైబడినా నియోజకవర్గ రాజకీయాల్లో అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన తనయుడు నంద్యాల కొండారెడ్డి  ఎన్నికల సమయంలో పూర్తిగా తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఆ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. నియోజక వర్గంలోని కేడరు, నాయకులతో మంచి సంబంధాలు పెట్టుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుని పూర్తి స్థాయి రాజకీయ ఆరంగేట్రం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆ నియోజకవర్గంలో 1994లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఆ నియోజకవర్గంలో గట్టి పట్టుతో వ్యవహరిస్తున్నారు. 


రామసుబ్బారెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రామసుబ్బారెడ్డి తనయుడు శివారెడ్డి ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోనే మకాం వేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈసారి రాజకీయ అరంగేట్రం చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అదేవిధంగా మంత్రి ఆదినారాయణరెడ్డి లెక్చరర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేస్తుండగా ఆయన సోదరుడు  రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆనాటి నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇటీవల టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్‌కుమార్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 


 ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తనయుడు సి.సుబ్బరామిరెడ్డి అలియాస్‌ భూపేష్ కుమార్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసి మైలవరం జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తన తండ్రి వీరారెడ్డి వారసురాలిగా రాజకీయ ప్రవేశం చేసి 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తనయుడు కె.రితేష్  బద్వేలు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తల్లి పాత్రధారిగా, తనయుడు సూత్ర ధారిగా ఈ నియోజకవర్గంలో రాజకీయాలు నడుపుతూ ఆయన తాత వీరారెడ్డి పేరుతో బీవీఆర్‌ ట్రస్టును నెలకొల్పి ఎ న్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో పోటీ చేసే పరిస్థితి లేకపోయినా తాము సూచించిన వ్యక్తికే టికెట్‌ తెచ్చుకుని గెలిపించి రాజకీయ ప్రవేశం చేయాలనే ఆలోచన చేస్తున్నారు.


రాయచోటి నియోజకవర్గంలోని పాలకొండ్రాయుడు ఎంపీ, ఎమ్మెల్యేగా గెలుపొంది జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. ఆయన తనయుడు సుగవాసి ప్రసాద్‌బాబు తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తండ్రి ఎన్నికల సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూనే మొదట రాయచోటి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆ తరువాత 2014లో టికెట్‌ కోసం ప్రయత్నించినా దక్కలేదు. ఈసారి టికెట్‌ దక్కించుకునేలా ప్రయత్నాలు చేస్తూ పాలకొండ్రాయుడి తనయుడిగా వారసత్వ రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. కడప నియోజకవర్గంలోని మాజీ మంత్రి ఖలీల్‌బాషా తనయుడు డాక్టర్‌ సొహైల్‌ టీడీపీ డాక్టర్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.  


తండ్రి వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసేందుకు పావులు కదుపుతూ ఈ సారి టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నా రు. మరో మాజీ మంత్రి అహ్మదుల్లా తనయుడు అస్రఫ్  తండ్రి పోటీ చేసిన సమయంలో అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చేవాడు. ఈసారి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కమలా పురంలోని మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆయన తనయుడు పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాల్లో రాణించాలని ఆలోచన చేస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కుమారుడు అనిల్‌కుమార్‌రెడ్డి  పార్టీ కార్యక్రమాల్లో హాజరవుతున్నారు, ఈసారి టికెట్‌ రేసులో తండ్రి వీరశివారెడ్డికి లేదా తనకు టికెట్‌ ఇవ్వాలని అనిల్‌కుమార్‌రెడ్డి పార్టీ నేతలను కోరుతున్నారు. ఇలా మొత్తంగా క‌డప నుంచి లెక్క‌కు మిక్కిలిగా నేత‌ల కుమారులు రంగంలోకి దిగుతుండ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: