వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జగ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యంపై ప్ర‌కాశం  జిల్లా వైసిపిలో తిరుగుబాటు మొద‌లైంది. కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌న్వ‌య‌కర్త‌గా ప‌నిచేస్తున్న వ‌రికూటి అశోక్ బాబు స్ధానంలో డాక్ట‌ర్ వెంక‌య్య‌ను జ‌గ‌న్ నియ‌మించ‌ట‌మే గంద‌ర‌గోళానికి  కార‌ణ‌మైంది. చాలా కాలంగా వ‌రికూటి పార్టీ కార్య‌క్ర‌మాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో బాగా చొచ్చుకుపోతున్నారు. అయితే, ఆయ‌న నియామ‌కంపై నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రికి ప‌డటం లేదు. స‌మ‌స్యంతా ఇక్క‌డే మొద‌లైంది.


స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ‌రికూటి తొల‌గింపు


అశోక్ అంటే ఏమాత్రం ప‌డ‌ని కొంద‌రు నేత‌లు మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి ద్వారా జ‌గ‌న్ పై ఒత్తిడి తెచ్చారు. దాని ఫ‌లితంగా అశోక్ స్ధానంలో స్ధానిక డాక్ట‌ర్ వెంక‌య్య‌ను స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా జ‌గ‌న్ నియ‌మించారు. దాంతో అశోక్ వ‌ర్గం ఒక్క‌సారిగా భ‌గ్గుమంది. ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకుని త‌మ‌ను అవ‌మానించారంటూ వ‌రికూటి త‌న మ‌ద్ద‌తుదారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. వారు కూడా వైవి సుబ్బారెడ్డే దీనికి కార‌ణ‌మంటూ మండిప‌డ్డారు. 


వెంక‌య్యే అభ్య‌ర్ధా ?


ఒంగోలులోని రిమ్స్ లో డాక్ట‌ర్ గా ఉన్న వెంక‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు హామీతోనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా వెంక‌య్య‌కు టంగుటూరు, శింగ‌రాయ‌కొండ‌లోని బ‌ల‌మైన నేత‌లు కూడా మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డారు. దాంతో జ‌గ‌న్ వ‌రికూటి స్ధానంలో వెంక‌య్య‌ను నియ‌మించారు. అదే స‌మ‌యంలో వ‌రికూటికి అనుకూలంగా నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామ‌స్ధాయి నుండి స‌మీక‌ర‌ణ‌లు మొద‌ల‌య్యాయి. దాంతో రాష్ట్ర నాయ‌క‌త్వం కూడా వరికూటిపై మండిప‌డుతోంది. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా అయినా స‌రే పోటీ చేయాల్సిందేనంటూ మ‌ద్ద‌తుదారులు  వ‌రికూటికి గట్టిగా చెబుతున్నారు. చివ‌ర‌కు అశోక్ ఏం చేస్తారో చూడాల్సిందే. అదే స‌మ‌యంలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఇటువంటి వివాదాలు మంచిది కాద‌ని కూడా పార్టీ నాయ‌క‌త్వం రెండు వ‌ర్గాల‌కు సూచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: