ఎన్నికల టైం ఇది. ఒక్క ఓటు ఎక్కడ వచ్చినా లాగేసుకోవాలని తపన పడతారు. అటువంటిది. ఓ సామాజిక వర్గం ఓట్లు గుత్త మొత్తంగా పొందాలని ఎవరికి ఉండదు ? నిన్న ఓ పార్టీ ఇదే గేం తో ఓట్ల పండించుకుంటే ఇపుడు మరో పార్టీ ఆ వర్గాన్ని దారికి తెచ్చుకునేందుకు పావులు కదుపుతోంది. మరి ఆ వర్గం ఇటు వైపు మళ్ళుతుందా...


బ్రాహ్మణుల ఓట్ల కోసం  వేట :


ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని ముందుగా అభినందించాలి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంతవరకు బ్రాహ్మణులను ఏ రాజకీయ పార్టీ ఏపీ వరకూ చూసుకుంటే ఓటు బ్యాంక్ గా పరిగణించలేదు. అయితే బాబు మాత్రం ఈ వర్గాన్ని దువ్వి 2014లో తనకు అనుకూలంగా ఓట్లను వేయించుకోగలిగారు. 2013లో ఆయన పాదయాత్ర చేస్తున్న టైంలో విశాఖ జిల్లా నర్శీపట్నంలో బ్రాహ్మణులతో మీటింగ్ పెట్టి మరీ ప్రత్యేక కార్పోరేషన్ ప్రకటించారు. అలా ఆ వర్గం నుంచి మెజారిటీ ఓట్లను సాధించగలిగారు.


మాట నిలుపుకోలేదు :


ఎన్నికల వేళ 500 కోట్లతో  బ్రాహ్మణుల కార్పోరేషన్ అంటూ స్టేట్మెంట్  ఇచ్చిన బాబు ఆనక కేవలం పాతిక కోట్లతోనే దాన్ని ప్రారంభించారు. అయిదేళ్ళు పూర్తి కావస్తూంటే ఇంతవరకూ  ఇచ్చింది అక్షరాల 135 కోట్లే. అంటే సగం కూడా కాదన్న మాట. సరిగ్గా ఈ పాయింట్ నే బయటకు తీసి వైసీపీ ఈ వర్గంపై గురి పెట్టబోతోంది. ఆ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే  కోన రఘుపతి బ్రాహ్మణులను చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని, అర్చకులకు కేవలం అయిదువేల రూపాయలే చెల్లిస్తున్నారని మండిపడ్డారు.


విశాఖలో మీటింగ్ :


బ్రాహ్మణుల కోసం వైసీపీ ఉందని చెబుతున్న కోన రఘుపతి ఈ నెల 10న విశాఖలోబ్రాహ్మణుల  భారీ సభను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఈ సభకు ఏపీవ్యాప్తంగా అన్ని బ్రాహ్మణుల సంఘాల ప్రతినిధులు హాజరు అవుతారని అన్నారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో జరిగే ఈ సభలో తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు చేయబోయే పధకాలను జగన్ వివరిస్తారని చెప్పారు. మొత్తానికి బ్రహ్మణులను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ వేస్తున్న ప్లాన్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: