ప్రపంచంలో ఎక్కడైనా సరే తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం కేవలం ఒక్క గురువుకి మాత్రమే దక్కుతుంది.  అనాధిగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది.  పురాణాల్లో సైతం విద్యాబుద్దలు నేర్చుకునేందుకు గురువుల వద్ద శిశ్యరికం చేసి ఎంతో పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు.  రాజుల కాలంలో గురుకులాలకు పంపించేవారు.  అన్ని విద్యల్లో ఆరితేరిన తర్వాత గురువులను మెప్పించి యువరాజులుగా పట్టాభిషేకం గావింపబడే వారు.  గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు.

గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం.  భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు. 1962లో భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతులు చేపట్టిన రాధాకృష్ణన్ వద్దకు కొంత మంది విద్యార్థులు, మిత్రులు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వారు రాధాకృష్ణన్ కోరారు.

అందుకు సమాధానంగా ఆయన - ప్రత్యేకంగా తన పుట్టిన రోజు జరపడానికి బదులు సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ రోజును భారతదేశంలో సెలవు దినంగా ప్రకటించలేదు. ఆ రోజున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.  భావి భారత పౌరులను తీర్చి దిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరించడం దేశాన్ని గౌరవించడం, సత్కరించడమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: