టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల దూకుడు పెంచుతున్నారు. హైద‌రాబాద్ శివారులోని కొంగ‌ర‌క‌లాన్‌లో సెప్టెంబ‌ర్ 2న నిర్వ‌హించ‌నున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో ఎన్నిక‌ల శంఖారావం పూరించ‌నున్నారు. ఈ స‌భ అనంత‌రం కేబినెట్ స‌మావేశం.. ఆ త‌ర్వాత కీల‌క నిర్ణ‌యం తీసుకుని పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. సెప్టెంబ‌ర్ 15వ తేదీ క‌ల్లా దాదాపుగా అభ్య‌ర్థ‌లంద‌రి పేర్లు వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో ముందుగా సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల స్థానాల్లో పేర్ల‌ను సీఎం కేసీఆర్ వెల్ల‌డిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ, ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల స్థానాల్లో ఆ త‌ర్వాత పేర్ల‌ను ప్ర‌క‌టిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ ప్ర‌క్రియ నేత‌ల్లో వ‌ణుకుపుట్టిస్తోంది. 


తెలంగాణ‌లో మొత్తం 119 అసెంబ్లీ, 17 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌కు 90మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 25మంది వ‌ర‌కు కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే.. ఐదారుగురికి త‌ప్ప మిగిలిన‌ సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇస్తామ‌ని ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. మ‌రికొద్ది రోజుల్లోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని కేసీఆర్ చెప్ప‌డంతో నేత‌ల్లో వ‌ణుకు మొద‌లైంది. ఇప్ప‌టికే దాదాపుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలో, ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దో.. అన్న విష‌యంలో కేసీఆర్ పూర్తి క్లారిటీతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన జాబితా కూడా రెడీగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో ప‌లువురు మంత్రుల స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. 


ఇక అభ్య‌ర్థుల జాబితాకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి నిజామాబాద్‌, కరీంనగర్, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారందరికీ టీఆర్‌ఎస్‌ అధినేత టికెట్లు ఖాయం చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంత‌కాలంగా ప‌లువురికి టికెట్ రాద‌నీ, ఇచేందుకు కేసీఆర్ సానుకూలంగా లేర‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ.. కేసీఆరే స్వ‌యంగా వారికి ఫోన్ చేసి.. ఎవ‌రి పని వారు చేసుకోవాల‌ని టికెట్ల‌పై హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక మెదక్‌ జిల్లాలో ఆందోల్‌ మినహా అన్ని స్థానాలకూ అభ్యర్థులు వారే ఉంటారని తెలుస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో చెన్నూరుపై కొంత గంద‌ర‌గోళం నెల‌కొంది. ఉమ్మ‌డి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకటి మినహా మిగిలిన ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అయినట్టుగానే తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా అందరికీ టికెట్లు దాదాపు ఖరారు చేసినట్టుగా సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: