ఏ రాజకీయ పార్టీకైన కొత్త రక్తం కావాలి. పాత వారు కూడా ఉండాలి. కానీ ఈ ఇద్దరి మధ్యన బ్యాలన్స్ చేయడం మాత్రం చాలా కష్టం. కొత్త నీరు రాగానే పాత నీరు అలా కొట్టుకుపోతుంది. అది సహజం.  రాజకీయాలలోనూ ఇదే జరుగుతోంది. అందుకే కొత్త కండువాలను చూస్తే కంగారు పుడుతుంది.


వైసీపీలో చేరికలు :


విశాఖ జిల్లా పాదయాత్రలో జగన్ కు జనం బ్రహ్మరధం పడుతున్నారు. అదే టైంలో అనేకమంది నాయకులు కూడా పార్టీలో చేరుతున్నారు. వీరిలో విద్యావంతులు, రాజకీయాలకు  కొత్త వారు కూడా ఉన్నారు. జగన్ వచ్చిన వారిని ఆలాగే చేర్చుకుంటున్నారు. మరి వారు ఊరకే పార్టీలోకి వస్తున్నారా అన్నది ఇక్కడ చూడాలి.


ఆ సీటు కోసమేనా :


వైసీపీలో ఈ రోజు విశాఖ సిటీకి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ చేరారు. ఆయనకు నగరంలో మంచి కార్పోరేట్ హాస్పిటల్ ఉంది. ఆర్ధికంగానె కాదు, సామాజికంగా బలమనిన నేపధ్యం ఉన్న ఆ డాక్టర్ గారి చేరికతో వైసీపీలో చర్చ మొదలైంది. ఆయనకు టికెట్ ఇస్తారా. ఇస్తే ఎక్కడ నుంచి అని. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఆ డాక్టర్ కి అక్కడే టికెట్ ఇస్తారేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


అయితే పార్టీలో ఇప్పటికే అక్కడ పాతుకుపోయిన నాయకులతో పాటు, పార్టీ కోసం చాల కాలంగా పనిచేస్తున్న వారూ అనేకమంది ఉన్నారు. దాంతో వారిలో కంగారు మొదలైంది. ఇదే విధంగా ఇతర చోట్ల కూడా కొత్త వారు వచ్చి చేరుతూండడంతో పాత వారు బెంగ పడుతున్నారు. తమకు టిక్కెట్లు వస్తాయా రావా అన్న టెన్షన్లో నేతాశ్రీలు పరేషాన్ అవుతున్నారు. అధినేత మనసులో ఏముందో తెలియదు. అడిగే డేరింగ్ ఎవరికీ లేదు. ఇదీ కధ.


మరింత సమాచారం తెలుసుకోండి: