ముందస్తు ఎన్నికల హడావుడిలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పార్టీలో తిరుగుబాట్లు తలనొప్పిగా మారాయి. గడచిన రెండు రోజులుగా తెలంగాణాలో ఒక్కసారిగా ముందస్తు ఎన్నికల వేడి పెరిగిపోయింది. అందులో భాగంగానే ప్రగతి భవన్లో కెసిఆర్ ముందస్తు పై ఎంఎల్ఏల అభిప్రాయాలను సేకరించేందుకు సమావేశం పెట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని కెసిఆర్ నిర్ణయించేసినా అభిప్రాయాల సేకరణ పేరుతో ఏదో ఓ నాటకం ఆడాలి కదా ? అందుకే ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. సరే, కెసిఆర్ మనసు తెలుసుకున్న తర్వాత ఎవరైనా అడ్డంగా మాట్లాడే సాహసం చేస్తారా ? అందుకే అందరూ ముందస్తుకే జై కొట్టారు.
శోభకు టిక్కెట్టిస్తే ఓటమి ఖాయం

అయితే, ఇక్కడే ఓ సమస్య తలెత్తింది. అదేమిటంటే, కరీనంగర్ ఎంఎల్ఏ (ఎస్సీ) బొడిగే శోభకు వ్యతిరేకంగా పలువురు నేతలు ఏకంగా కెసిఆర్ కే ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో శోభకు టిక్కెట్టిస్తే కచ్చితంగా ఓటమి ఖాయమంటూ తేల్చి చెప్పేశారు. తనకు పడని పార్టీ నేతలపైనే ఎంఎల్ఏ ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు పెట్టించారంటూ పెద్ద ఫిర్యాదే చేశారు. దాంతో అక్కడే ఉన్న శోభతో పాటు పలువురు మంత్రులు, ఎంఎల్ఏలకు షాక కొట్టినట్లైంది. తమ నియోజకవర్గంలో పార్టీ గెలవాలంటే శోభకు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ టిక్కెట్టు ఇవ్వకూడదంటూ సమావేశంలోనే కెసిఆర్ కు పలువురు నేతలు తేల్చిచెప్పారు.
అదే పద్దతిలో కరీనంగర్ జిల్లాలోనే ఉన్న రామగుండం నియోజకవర్గం ఎంఎల్ఏ సోమారపు సత్యనారాయణ, ఇదే జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం ఎంఎల్ఏ చెన్నమనేని రమేష్ లపైన కూడా ఆయా నియోజకవర్గాల్లోని నేతలు తిరుగుబాటు లేవదీశారు. ఒకే జిల్లాలోని ముగ్గురు ఎంఎల్ఏలపై పార్టీ నేతలే తిరుగుబాటు లేవదీయటమంటే మామూలు విషయం కాదు. అందులోనూ సరిగ్గా ముందస్తు ఎన్నికలకు ముందు.
సోమారపు పై తిరుగుబాటు

రామగుండం ఎంఎల్ఏ సోమారపు స్టైలే వేరు. ఆయన ఎవరినీ లెక్క చేయరు. అందుకే మున్సిపాల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు వ్యతిరేకమైపోయారు. నేతలతో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే రాజీనామా అస్త్రాన్ని బయటకు తీస్తారు. దాంతో ఎంఎల్ఏ ఒంటెత్తుపోకడలతో కెసిఆర్ కూడా విసిగిపోయారనే చెప్పాలి. ఇపుడు కూడా నియోజకవర్గంలోని చాలా మంది నేతలతో ఎంఎల్ఏకు ఏమాత్రం పడటం లేదు. అందుకనే ఈ మధ్యనే నియోజకవర్గంలోని నేతలందరూ సమావేశమై సోమారపుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టివ్వదంటూ కేసిఆర్ ను కోరారు. తమ మాటను కాదని టిక్కెట్టిస్తే పార్టీ ఓటమిలో తమ బాధ్యత లేదని చెప్పటం గమనార్హం.
రమేష్ కనిపించటం లేదు

ఇక, వేములవాడ నియోజకవర్గం ఎంఎల్ఏ చెన్నమనేని రమేష్ ది మరో సమస్య. ఆయన అసలు నియోజకవర్గంలో నేతలకు అందుబాటులోనే ఉండరు. ఎంఎల్ఏలతో ఏదైనా మాట్లాడాలన్నా, సమస్యపై చెప్పాలన్నా అందరూ జర్మనీకి వెళ్ళాలనే టాక్ బాగా వినిపిస్తోంది. జర్మనీకి ఎందుకంటే, ఎంఎల్ఏ ఉండేది జర్మనీలోనే కాబట్టి. పుట్టింది, పెరిగింది ఇక్కడే అయినా చాలా సంవత్సరాల క్రిందటే రమేష్ జర్మనీకి వెళ్ళి సెటిలైపోయారు. రమేష్ కు జర్మనీ పౌరసత్వమే ఉంది. ఎంఎల్ఏ పౌరసత్వంపై సంవత్సరాలుగా కోర్టుల్లో కేసు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భారతదేశ పౌరుడే కానీ రమేష్ కు టిఆర్ఎస్ టిక్కెట్టివటం, జనాలు ఓట్లేసి గెలిపించటమే విచిత్రం. అవసరానికి అందుబాటులో ఉండని రమేష్ కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టిస్తే ఓటమి ఖాయమని నేతలందరూ కెసిఆర్ కు తేల్చి చెప్పేశారు. ఇపుడు బయటపడ్డ తిరుగుబాట్లు ఇవి. ఇంకెతమంది ఎంఎల్ఏలపై ఆయా నియోజకవర్గాల్లోని నేతలు తిరుగుబాట్లు లేవదీస్తారో చూడాల్సిందే.
5/
5 -
(1 votes)
Add To Favourite