ఓ వైపు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ తెల్లారిలేస్తే నీతి కధలు చెబుతారు. మరో వైపు మాత్రం నిర్లజ్జగా అదే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారు. రాజ్యాంగం పట్ల నిబద్దత అని చెబుతూనే మరో చేత్తో విలువలకు పాతర వేస్తారు. ఇదేమని అడిగితే నాడు నీవు చేయలెదా అంటూ ఎదురుదాడి మొదలెడతారు. ఇంతేనా... ఎప్పటికపుడు తప్పించుకోవడమేనా...


జగన్ సూటి ప్రశ్న :


తమ పార్టీ గుర్తుపై గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులను చేయాలని, అపుడే తాము అసెంబ్లీలోకి అడుగుపెడతామని వైసీపీ అధినేత జగన్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ రికార్డుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అని చూపిస్తూ మరో వైపు వారికి అధికార పార్టీ బెంచీల వైపు ఎలా కూర్చోబెడతారని జగన్ ఆ లేఖలో నిలదీసారు. ఇదే తీరున సీఎం చంద్రబాబుకు జగన్ లేఖను సంధించారు. ఫిరాయింపులను మంత్రులుగా చేరుచుకుని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని జగన్ అటాక్ చేశారు.


ఎదురుదాడే ఆన్సర్ :


దానికి విరుగుడు అన్నట్లుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో టీడీపీ మరో బహిరంగ లేఖాస్త్రాన్ని రాయించింది. జగన్ తండ్రి వైఎస్, అలాగే నాటి కాంగ్రెస్ ఇలాంటి ఫిరాయింపులు చేయలేదా అంటూ ఆ లేఖలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా ప్రశ్నించారు. అపుదు ఒప్పు అయింది ఇపుడు ఎందుకు తప్పు అవుతుందని కూడా వారు కౌటర్లేశారు. జగన్ వ్యవహార శైలి నచ్చకే తాము టీడీపీ వైపు వచ్చామని సమర్ధించుకున్నారు.


ఆయన చెప్పి రెండు రోజులు కాలేదే :


మరో వైపు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫిరాయింపులపై నీతి వాక్యాలు చెప్పి రెండు రోజులు కూడా కాలేదు. ఎవరైనా ఏ పార్టీ నుంచి అయినా గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళాలని అనుకున్నపుడు రాజీనామ చేయాలని వెంకయ్యనాయుడు చెప్పారు. రాజ్యాంగమూ అదే చెబుతోంది. కానీ దానిని వదిలేసి రాజకీయ నీతి ఇది అంటూ చెప్పడం అంటే నైతికతను తుంగలోకి తొక్కడమే. ఏది ఏమైనా ఫిరాయింపులు చట్టబద్దం అని చెప్పేసుకుంటే పోయేదానికి తరచూ నైతికత ముసుగు లో దెబ్బలాటలెందుకో. మొత్తానికి అన్ని పార్టీలూ రాజకీయమే ముఖ్యమనుకుని సాగుతున్న టైంలో మరో మారు రాజ్యాంగం చిన్నబోయింది. అంతే.



మరింత సమాచారం తెలుసుకోండి: