ముఖ్య‌మంత్రి కె చంద్ర‌శేఖ‌ర్ రావు అధ్య‌క్ష‌త‌న ప్రారంభ‌మైన క్యాబినెట్ స‌మావేశం అసెంబ్లీ ర‌ద్దుకు తీర్మానం చేసింది. ప్ర‌గ‌తి భ‌వ‌న్లో కొద్దిసేప‌టి క్రిత‌మే ప్రారంభ‌మైన మంత్రివ‌ర్గ స‌మావేశంలో  శాస‌న‌స‌భ ర‌ద్దుకు ఏక‌వాక్య తీర్మానం చేసిన‌ట్లు స‌మాచారం. క్యాబినెట్ స‌మావేశం  ముగియ‌గానే కెసిఆర్ త‌న స‌హ‌చ‌రుల‌తో ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ ఇఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ ను క‌లుస్తున్నారు. క్యాబినెట్ తీర్మానాన్ని అంద‌చేస్తారు.  క్యాబినెట్ తీర్మానానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొంద‌గానే అసెంబ్లీ ర‌ద్దైన‌ట్లే లెక్క‌. 


ప్ర‌తిప‌క్షాల‌ను దెబ్బ‌కొట్ట‌టానికే 


అసెంబ్లీ కాల‌ప‌రిమితి ముగియ‌టానికి ఇంకా  దాదాపు తొమ్మిది నెల‌లుండ‌గానే  కెసిఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళాల‌ని అనుకోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ప్ర‌తిప‌క్షాల‌ను దెబ్బ‌కొట్టాల‌నే. ముఖ్య‌మంత్రి అయిన ద‌గ్గ‌ర నుండి కెసిఆర్ ప్ర‌తిప‌క్షాల‌ను చీలిక‌లు పీల‌క‌లు చేసేశారు. కాంగ్రెస్, టిడిపిల‌కు చెందిన ఎంఎల్ఏల‌ను పెద్ద ఎత్తున  పిరాయింపుల‌కు ప్రోత్స‌హించారు. పోయిన ఎన్నిక‌ల్లో 22 మంది ఎంఎల్ఏలు, 16 ఎంఎల్ఏల‌తో గెలిచిన కాంగ్రెస్, టిడిపిలు బ‌లంగానే క‌నిపించాయి. అస‌లే అత్తెస‌రు 63 మంది ఎంఎల్ఏల‌తో  సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచిన కెసిఆర్ లో అభ‌ద్ర‌త మొద‌లై ఫిరాయింపుల‌కు ప్రోత్స‌హించి ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీన ప‌రిచిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 


ఎన్నిక‌ల క‌మీష‌న్ ఏం చేస్తుందో ?


బ‌ల‌హీనంగా క‌నిపిస్తున్న ప్ర‌తిప‌క్షాల‌ను మ‌రింత దెబ్బ తీసే ఉద్దేశ్యంతోనే హ‌టాత్తుగా ముందస్తు ఎన్నిక‌ల గంట‌ను మోగించారు.  పొత్తులు కూడా పెట్టుకునే అవ‌కాశం ఇవ్వ‌కుండా  ప్ర‌తిప‌క్షాల‌ను మ‌రింత గంద‌ర‌గోళంలోకి నెట్టేయ‌టం ద్వారా తాను ల‌బ్దిపొందాల‌న్న రాజ‌కీయ కార‌ణ‌మే తప్ప ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మ‌రింకేం కార‌ణం కనిపించ‌టం లేదు.  ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిఫార‌సు చేయ‌టం కెసిఆర్ చేతిలో ప‌ని కాబ‌ట్టి ఆ ప‌ని చేసేశారు.  కెసిఆర్ వ్యూహం వ‌ర్క‌వుట్ అయితే డిసెంబ‌ర్ నెలాఖ‌రులోగా ఎన్నిక‌లు వ‌స్తాయి. లేక‌పోతే మామూలుగానే వ‌చ్చే ఏప్రిల్, మే నెల‌లోనే ఎన్నిక‌లుంటాయి. మ‌రి,  ఎన్నిక‌ల క‌మీష‌న్ ఏం చేస్తుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: