సంచ‌ల‌నాల‌కు కేరాఫ్‌గా ఉండే తెలంగాణ సీఎం, ఉద్య‌మ సార‌థి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు.. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఊహాగానాలుగానే భావించిన అసెంబ్లీ ర‌ద్దును కార్య‌రూపంలోకి తెస్తూ.. ఆయ‌న షాకింగ్ నిర్ణ‌యాన్ని వెలువ‌రించారు. అసెంబ్లీని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో ఏకవాఖ్య తీర్మానం ప్రవేశపెట్టారు. గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం. శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకుంటారు. ఏక‌వాక్య తీర్మానంతోనే ఆయ‌న అసెంబ్లీ ర‌ద్దు చేసేశారు.


రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితులు, త‌న పాల‌న‌పై వెల్లువెత్తుతున్న అనేక ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విప‌క్షాల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ముఖ్యంగా కుటుంబ పాల‌న తెలంగాణ‌ను శాసిస్తోందంటూ.. ఒక ప‌క్క కాంగ్రెస్‌, మ‌రోప‌క్క‌, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం పార్టీలు తీవ్ర‌స్థాయిలో ఏకేస్తున్నాయి. వీటిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్‌.. నేరుగా వారికి స‌మాధానం చెప్ప‌కుండా ప్ర‌జ‌ల‌తోనే చెప్పించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటార‌ని గ‌త కొద్ది రోజులుగా ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల కొంగ‌ర క‌లాన్‌లో నిర్వ‌హించిన ప్ర‌గ‌తి నివేద‌న స‌భా వేదిక నుంచి ఇదే విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యం అప్పుడు కేసీఆర్ వ్యూహాత్మ‌క మౌనం పాటించారు. 


ఇక‌, ఇప్పుడు గురువారం అనూహ్యంగా ఆయ‌న స‌భ‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. నిజానికి ఉద్య‌మంతో సాధించి న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాల‌నే ఓ ప్ర‌భంజ‌నం. తొలి రెండేళ్ల‌పాటు ఆయ‌న‌ను విమ‌ర్శించే ధైర్యం కూడా ఎవ‌రూ చేయ‌లేక‌పోయారు. అంతేకాదు, రాష్ట్రంలో ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాల‌ను ఏకాకుల‌ను చేయాల‌నే నిర్ణ‌యంతో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌దీసిన కేసీఆర్ అన్ని పార్టీలలోనూ వ‌ణుకు పుట్టించారు.

ఇలాంటి త‌రుణంలో ఇంకా ఆయ‌న ప్ర‌భుత్వానికి తొమ్మిది నెల‌ల‌కు పైగా స‌మ‌యం ఉండ‌గానే ఇప్పుడు ఈ హ‌ఠాత్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతున్నా.. వ్యూహాత్మ‌కంగానే కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. గురువారంతో కేసీఆర్ తెలంగాణ సీఎంగా నాలుగేళ్ల మూడు నెల‌ల 4 రోజులు పూర్తి చేసుకుంది. మ‌రి ఈ వ్యూహంలో కేసీఆర్ విజ‌యం సాధిస్తారో ప్ర‌తిప‌క్షాలు పై చేయి సాధిస్తాయో చూడాలి!



మరింత సమాచారం తెలుసుకోండి: