తెలంగాణ అసెంబ్లీ ర‌ద్ద‌య్యింది. ఇక‌ ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మైంది. టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. దాదాపుగా మూడు నెల‌ల నుంచి  గ్రౌండ్ వ‌ర్క్ కేసీఆర్‌ పూర్తి చేశారు. ఏక కాలంలో ఆయ‌న పాల‌నా సంబంధ‌మైన ఇబ్బందుల‌ను, పార్టీ ప‌ర‌మైన క‌స‌ర‌త్తు చేశారు. ఓ వైపు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే.. ఎలాంటి సాంకేతిక అడ్డంకులు ఎదురుకాకుండా ఢిల్లీ స్థాయిలో క‌స‌ర‌త్తు చేస్తూనే.. పార్టీ అభ్య‌ర్థుల జాబితాను ఆయ‌న సిద్ధం చేశారు. ఓకేసారి 105 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల పేర్ల‌ను ఖ‌రారు చేశారు. మ‌రోవైపు రేప‌టి నుంచి 50 రోజుల్లో 100 ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఆయ‌నకు బాగా క‌లిసివ‌చ్చే.. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా హ‌స్నాబాద్‌లో శుక్ర‌వారం  నిర్వ‌హించే స‌భ‌లో కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి శంఖారావం పూరించనున్నారు. ఇలా ఏక కాలంలో ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌ను త‌న క‌నుస‌న్న‌ల్లో న‌డిపించారు.


అయితే.. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా తాము కూడా సిద్ధంగా ఉన్నామంటూ టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. కానీ.. వారు చెప్పిన‌ట్టుగానే.. సిద్దంగా ఉందా..? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేద‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌రిస్థితుల‌ను చూస్తే.. ఇంకా ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగాలా..?  లేక పొత్తుల‌తో ముందుకు వెళ్లాలా..? అన్న విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఆవైపుగా ఇత‌ర పార్టీలతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డంలో కూడా కాంగ్రెస్ పెద్ద‌లు విఫ‌లం చెందార‌నే టాక్ వినిపిస్తోంది.


అంతేగాకుండా.. టీడీపీ, తెలంగాణ జ‌న‌స‌మితి, వామ‌ప‌క్షాల‌తో కూట‌మి ఏర్పాటుపై కూడా ఇప్ప‌టికీ క్లారీటీ లేదు. ఈ విష‌యంలో కాంగ్రెస్ నేత‌లు చాలా ఆల‌స్యం చేసిన‌ట్లు తెలిసిపోతోంది. కూట‌మి ఏర్పాటు కాకుండా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం లేదు. పొత్తులు కుదిరిన త‌ర్వాత గానీ.. సీట్ల పంప‌కాలు పూర్తి అయిన త‌ర్వాత‌గానీ.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కానీ.. ఈ విష‌యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ముందుంది. నిత్యం స‌ర్వేలు జ‌రిపి, ఎమ్మెల్యేలు, ఎంపీల ప‌నితీరును గ‌మ‌నిస్తూ మార్కులు వేస్తూ వ‌స్తున్న కేసీఆర్ ఇప్ప‌టికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చే అభ్య‌ర్థ‌ల జాబితాను కూడా రెడీ చేశారు. ఇలా అనేక విష‌యాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా వెన‌క‌బ‌డే ఉంద‌ని చెప్పొచ్చు. ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర‌, రాహుల్‌తో హైదరాబాద్‌లో మీటింగ్‌లు నిర్వ‌హించ‌డం త‌ప్ప రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు ఏమీ చేయ‌లేక‌పోయార‌నే టాక్ ఉంది. ఇక విప‌క్షాల‌కు ఏ మాత్రం తేరుకునే ఛాన్స్ ఇవ్వ‌కుండానే కేసీఆర్ ముంద‌స్తు స్ట్రాట‌జీతో వెళ్లిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: