తెలంగాణ రాజ‌కీయాల్లో కంచుకంఠంతో విమ‌ర్శ‌లు గుప్పించే ఫైర్ బ్రాండ్, టీడీపీ మాజీ నేత‌, ప్ర‌స్తుతం కాంగ్రెస్ నేత ఎనుముల రేవంత్ రెడ్డి. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న‌కు పెట్ట‌ని కోట‌. 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై వ‌రుస విజ‌యంతో మంచి జోష్ మీదున్న రేవంత్ రెడ్డి.. ఏడాదిన్న‌ర కింద‌ట తీవ్ర నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. అయితే, పార్టీ క‌న్నా కూడా వ్య‌క్తిగ‌తంగా మంచి ఇమేజ్‌.. గెలుపు గుర్రంగా తిరుగులేని ఆధిప‌త్యాన్ని సాధించిన రేవంత్ ఎప్పుడూ కూడా కేసీఆర్‌కు కంట్లో న‌లుసులాగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తి విష‌యంలో నూ కేసీఆర్‌కు స‌వాళ్లు రువ్వుతుండ‌డం, నువ్వెంత అంటే నువ్వెంత‌? అనే రేంజ్‌లో రాజ‌కీయాలు చేయ‌డంలోనూ  రేవంత్‌కు తిరుగులేదు. 


అయితే, రేవంత్‌ను రాజ‌కీయంగా ఎదుర్కొనేందుకు, ఆయ‌న‌ను అట్ట‌ర్ ఫ్లాప్ చేసేందుకు కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాలు ప‌న్నుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఓటుకు నోటు కేసును త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని రేవంత్‌ను జైలుకు కూడా పంపారు. ప్ర‌స్తుతం బెయిల్ పై ఉన్న రేవంత్‌ను ఎదుర్కొన‌డంపై కేసీఆర్ చాలానే క‌స‌రత్తు చేస్తున్నారు. మ‌రో నెల రోజుల్లోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తాజాగా అభ్య‌ర్థుల‌ను సైతం ప్ర‌క‌టించారు. దాదాపు 105 స్థానాల్లో అభ్య‌ర్థుల పేర్ల‌ను వెల్ల‌డించారు. రేప‌టి నుంచి హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీ కూడా నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో రేవంత్‌పై గ‌ట్టి వ్య‌క్తినే నిల‌బెట్టారు. 


రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన నియోజక వర్గాల్లో కొడంగల్ ఒకటి. కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డికి పట్టున్న నియోజకవర్గం ఇది. ఇక్కడ రేవంత్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాలను పన్నుతోంది. రేవంత్‌కు పోటీగా ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిని నిలబెడుతోంది. ఈ మేర‌కు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితాలో కొడంగ‌ల్‌కు ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని ఖ‌రారు చేశారు కేసీఆర్‌. ఆర్థికంగా బ‌ల‌మైన అభ్య‌ర్థే కాకుండా టీఆర్ ఎస్‌కు మంచి న‌మ్మ‌క‌మైన వ్య‌క్తి కూడా కావ‌డంతో న‌రేంద‌ర్‌కు ఈ టికెట్ ఖాయం చేశార‌ని అంటున్నారు. న‌రేంద‌ర్‌రెడ్డి మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డికి స్వ‌యానా సోద‌రుడు. ఆయ‌న ఇప్ప‌టికే కొడంగ‌ల్‌లో ప్రొటోకాల్ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. అయితే, రేవంత్ వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను ఈయ న దెబ్బ కొట్ట‌గ‌ల‌డా? అనేది సందేహం! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: