తెలుగుదేశం పార్టీ అంతర్గత  రాజకీయాలు ఆ పార్టీలో ఎంతటి సీనియర్ అని చెప్పుకుంటున్న వారికి కూడా తెలియవు. అప్పట్లో అన్న నందమూరి జమానాలో ఎపుడో తెల్లాజామున నిర్ణయాలు తీసేసుకుని ఇదే ఫైనల్ అనేవారంట. అల్లుడు చంద్రబాబు దీ అలాగే సొంత నిర్ణయాలే అయినా అందరినీ అడిగినట్లుగా మొక్కుబడి తంతు ఒకటి ఉంటుంది. మరి అంతవరకూ ఎవరికీ తెలియదు ఏ విషయమైనా. మరి కీలకమైన నిర్ణయాలు పొరుగు పార్టీ నాయకులకు ఎలా తెలుస్తున్నాయి.


ఆయన చెబుతున్నాడు :


టీడీపీలో టికెట్లు ఫలానా వారికి రావు అంటూ శత్రువు పార్టీ వైసీపీ చెబుతోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు టికెట్లు ఇవ్వరంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. వైసీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే.


ఎలా  చెబుతున్నారు :


ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆషా మాషీలేం కారు కదా. అక్కడ టీడీపీ తమ్ముళ్ళను ఓడించి వాళ్ళు గెలిచారన్నది బాబుకి తెలిసే కదా వారికి కండువాలు కప్పి తీసుకున్నది. అంటే సొంత పార్టీ వారి కంటే సమర్ధులు అని భావించే బాబు వారిని తన గూటిలోకి తెచ్చుకున్నరని కదా అర్ధం. అటువంటపుడు వారికి టికెట్లు రావని రాంబాబు ఎలా చెబుతున్నారు.


గట్టి వారున్నారుగా :


కడప విషయానికే వస్తే మంత్రి ఆదినారాయణరెడ్డి గట్టి క్యాండిడేట్. చిత్తూర్లో మరో మంత్రి అమరనాధ్రెడ్డి కూడా బలమున్న నాయకుడే. విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజుల పలుకుబడి అందరికీ తెలిసిందే. ఇక్కడ మంత్రి సుజయక్రిష్ణా రంగారావుని బాబు కాదనగలరా. ఇలా చూసుకుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలలో మరి కొంత మంది గట్టి నాయకులు ఉన్నారు,  వారిని కాదనగలరని అంబటి ఎలా భావిస్తున్నారో.. 


మొత్తానికి చూసుకుంటే అంబటి వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయపరమైనవేననిపిస్తోంది. లేదా ఫిరాయింపు ఎమ్మెల్యేలను బెదిరించే వ్యూహమూ కావచ్చు. నిజానికి బాబు టికెట్లు ఇవ్వకపోవడానికి వేయి కారణాలు చూపించి సొంత తమ్ముళ్ళనూ పక్కన పెట్టగలరు. అలా చేసినపుడు ఫిరాయింపులకూ మినహాయింపు ఉండదు. ఏదేమైనా అందరికీ టికెట్లు రావన్న మాట మాత్రం సబబు. 


మరింత సమాచారం తెలుసుకోండి: